అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి వెంటనే పరిష్కరించాలి ఇక ప్రతి సోమవారం ఆర్డీవో కార్యాలయంలో ప్రజావాణి….
ముద్ర, కోరుట్ల;
కోరుట్ల పట్టణంలో రెవెన్యూ డివిజన్ స్థాయిలో నూతనంగా ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం రోజున ప్రారంభించారు. ఇంతకు ముందు జిల్లా కలెక్టరేట్లో మాత్రమే నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు డివిజన్ స్థాయికి విస్తరించారు. ఈ సందర్భంగా కోరుట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను డివిజన్ స్థాయి అధికారులు, తహసీల్దార్లు స్వీకరించారు. మొత్తం తొమ్మిది ఫిర్యాదులు అందగా, అందులో రెవెన్యూ శాఖకు ఏడు, మున్సిపల్ శాఖకు ఒకటి, పంచాయతీరాజ్ శాఖకు ఒకటి చొప్పున వచ్చాయి. డివిజన్ కేంద్రంతో పాటు పరిధిలోని పలు మండలాల నుంచి ప్రజలు తమ సమస్యలను వినిపించేందుకు ప్రజావాణికి హాజరయ్యారని తెలిపారు. అధికారులు తమ శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా స్పందించి, సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చూపాలని సూచించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం ఇకపై ప్రతి సోమవారం ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించబడుతుందని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎల్. జీవాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు, జిల్లా వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.