Take a fresh look at your lifestyle.

సమిష్టి కృషితోనే స్పోర్ట్స్ మీట్ విజయవంతం: సైబరాబాద్ సీపీ డా.ఎం. రమేష్

 

-క్రీడల్లో రాణించాలి.. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి.


ముద్ర, శేరిలింగంపల్లి :
పోలీసు సిబ్బంది విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, అదే సమయంలో వ్యక్తిగత జీవితంలో ఆర్థిక క్రమశిక్షణతో మెలగాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ సూచించారు. ఈ నెల 18వ తేదీ నుంచి 21 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026’ విజయవంతం కావడానికి కృషి చేసిన సిబ్బందిని సోమవారం ఆయన అభినందించారు. గచ్చిబౌలిలోని కమిషనరేట్ ఆడిటోరియంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో, పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను సీపీ ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ స్పోర్ట్స్ మీట్ విజయవంతం కావడంలో అన్ని విభాగాల సిబ్బంది శక్తి వంచన లేకుండా సమిష్టిగా కష్టపడ్డారని గుర్తు చేశారు. క్రీడల్లో పాల్గొన్న సిబ్బంది ఎటువంటి గాయాలు లేకుండా క్షేమంగా వారివారి యూనిట్లకు తిరిగి వెళ్లడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో జరగబోయే అన్ని క్రీడల్లోనూ సైబరాబాద్ పోలీసులు ఇదే ఉత్సాహంతో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడల్లో ప్రతిభ ఉన్న సిబ్బందిని గుర్తించి, వారికి తగిన శిక్షణ అందిస్తామని, తద్వారా జాతీయ స్థాయి పోటీల్లోనూ పతకాలు సాధించేలా ప్రోత్సహిస్తామని తెలిపారు.

వృత్తి నైపుణ్యం – కుటుంబ బాధ్యత:

సిబ్బంది తమ విధుల్లో బాధ్యతతను పెంచుకోవాలని, తద్వారా కుటుంబ సభ్యులకు నాణ్యమైన సమయాన్ని కేటాయించే అవకాశం ఉంటుందని సీపీ పేర్కొన్నారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనుకునే వారికి పోలీస్ శాఖ నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఎవరి దగ్గరైనా వినూత్న ఆలోచనలు ఉంటే నేరుగా తనను కలిసి నిస్సంకోచంగా చెప్పవచ్చన్నారు.

ఆర్థిక మోసాల పట్ల అప్రమత్తం:

పోలీసు సిబ్బంది ఆర్థిక వ్యవహారాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సీపీ సూచించారు. అధిక లాభాల ఆశతో ఎక్కువ వడ్డీకి డబ్బులు పెట్టి మోసపోవద్దని, బ్యాంక్ వడ్డీ కంటే ఎక్కువ ఇస్తామనే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎవరైనా సహచర సిబ్బంది అధికంగా అప్పులు చేస్తున్నట్లు గమనిస్తే, తోటివారు వారికి సరైన మార్గనిర్దేశం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీఆర్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, ఈసీఆర్ హెడ్‌క్వార్టర్స్ ఏసీపీ షమీర్, సీఎస్‌డబ్ల్యూ ఏసీపీ హనుమంతరావు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.