ఇప్పటికే వేలాది పేద కుటుంబాలు వేధింపులు, నిర్బంధాలకు గురయ్యారు
గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో హైడ్రా జులుం
ముద్ర, హైదరాబాద్ :
మహా నగరంలో హైడా పేరుతో పేదలపై కాంగ్రెస్ సర్కారు కొనసాగిస్తున్న దాడిని చరిత్ర ఎప్పటికీ మరచిపోదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పేర్కొన్నారు. ఇప్పటికే వేలాది పేద కుటుంబాలు వేధింపులు, నిర్బంధాలకు గురయ్యాయని ఆరోపించారు. తాజాగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో సుమారు 450 మంది పేద కుటుంబాలను ఖాళీ చేయించి, తరలించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సోమవారం ఆయన ఎక్స్ వేదిక స్పందించారు. అభివృద్ధి పేరుతో పేదల జీవితాలను అంధకారంలోకి నెట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమంజసం కాదన్నారు. ఏ ప్రాజెక్ట్ అయినా, ఎంత ప్రతిష్టాత్మకమైనదైనా చట్టబద్ధమైన విధానాలు, గౌరవప్రదమైన పునరావాసం, పూర్తి పారదర్శకత తప్పనిసరిగా కల్పించాలన్నారు. తగిన భద్రత లేకుండా, బలవంతంగా పేదలను ఖాళీ చేయించడం మానవత్వానికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ప్రభావిత ప్రతి కుటుంబం పక్షాన తాము దృఢంగా నిలుస్తాం. ప్రతి కుటుంబానికి న్యాయం, పారదర్శకత, సముచిత పునరావాసం కల్పించాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు.