వచ్చే నెల 25 తర్వాత పొడగించే ప్రసక్తే లేదు
నిరుద్యోగ అభ్యర్ధులకు టీజీపీఎస్సీ సూచన
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్దమమ్యే అభ్యర్థులకు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) అప్‌డేట్ చేసుకునే గడువును వచ్చే నెల 25 వరకు పొడిగిస్తున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి ఇదే చివరి అవకాశమని పేర్కొంది. దీని తర్వాత మళ్ళీ గడువు పొడిగించే ప్రసక్తే లేదని కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌లో నింపే సమాచారానికి ఓటీఆర్ డేటానే ప్రాథమిక ఆధారం అవుతుందని పేర్కొంది. అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in ద్వారా తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని తెలిపింది. సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా గడువు ముగియడానికి ముందే వివరాలను సరిచూసుకుని, సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయాలని సూచించింది. ఇప్పటివరకు ఓటీఆర్ అప్డేషన్ పూర్తి చేయని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కమిషన్ కోరింది.