Take a fresh look at your lifestyle.

మహిళా సంక్షేమం, భద్రతకు కార్యాచరణ -రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

అంశాల వారీగా సబ్ కమిటీలు ఏర్పాటు
ఉద్యోగ రంగంలో మహిళలకు సమాన హక్కులు

ముద్ర, తెలంగాణ బ్యూరో :

మహిళల సమగ్ర సంక్షేమం, భద్రత కోసం మహిళా, శిశు సంక్షేమ, పోలీస్ శాఖల సమన్వయంతో ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంబంధిత అధికారులను ఆదేశించారు. ముందుగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. మహిళల సాధికారతే రాష్ట్ర అభివృద్ధికి పునాదన్న మంత్రి.. వారి భద్రత, సమాన అవకాశాలు, ఆరోగ్యం, గౌరవప్రద జీవనం కల్పించడం ప్రభుత్వ ధర్మం అన్నారు. లింగ వివక్షను నిర్మూలించి, మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. విద్యా వ్యవస్థలోనే లింగ సమానత్వ భావనను బలపరిచే విధంగా పాఠ్యాంశాలలో మార్పులు చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో మహిళల అభివృద్ధి, సాధికారత, సమాన అవకాశాలు, భద్రత అంశాలపై పలు కీలక శాఖలతో ఆమె ఉన్న‌తస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యోగ రంగంలో మహిళలకు సమాన హక్కులు, ప్రైవేటు రంగంలోనూ మ‌హిళ‌ల‌కు మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అమ‌లు వంటి అంశాలపై విధానపరమైన మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియా మోసాలు, డేటింగ్ యాప్స్, మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా జరుగుతున్న మోసాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో వెలువడిన సూచనల అమలుకు అంశాల వారీగా సబ్ కమిటీలు ఏర్పాటు చేసి, తక్షణమే కార్యాచరణ బృందాలను నియమించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీ చారు సిన్హా, పీసీసీఎఫ్ డా. సి. సువర్ణ, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టరేట్‌కు చెందిన సంగీతా సత్యనారాయణ, విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీ వెంకటేశ్ దోత్రే, మున్సిపల్ శాఖ కమిషనర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.