Take a fresh look at your lifestyle.

పన్ను ఎగవేతదారులపై విజిలెన్స్ కొరడా

అక్రమ మైనింగ్, నిత్యావసర వస్తువుల దారి మళ్లింపుపై నజర్
ప్రభుత్వ ఆదాయానికి రూ.10.79 కోట్ల గండి
గత నెలలో ఐదు శాఖలతో ముమ్మర తనిఖీలు
హైవేలు, ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్‌ల వద్ద వెయ్యికి పైగా వాహనాలు సీజ్

ముద్ర, తెలంగాణ బ్యూరో :

రాష్ట్రంలో పన్ను ఎగవేతదారులు, అక్రమ మైనింగ్, నిత్యావసర వస్తువుల దారి మళ్లింపుపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం దృష్టిసారించింది. ఈ మేరకు గత నెలలో రవాణా, జీఎస్టీ, గనులు, అటవీ, పోలీస్ శాఖలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ముమ్మర తనిఖీల్లో భారీగా అక్రమాలను గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా హైవేలు, ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్‌ల వద్ద వెయ్యికి పైగా వాహనాలను తనిఖీ చేసిన సంబంధిత అధికారులు వివిధ నిబంధనల ఉల్లంఘనల కింద 200 వాహనాలను సీజ్ చేశారు. స్పెషల్ రెయిడ్స్‌లో భాగంగా 245 మెట్రిక్ టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పాల్గొన్న 6 ఎక్స్‌కవేటర్లు, 15 ట్రాక్టర్లు సహా మొత్తం 24 వాహనాలను జప్తు చేసి, 19 మందిని అరెస్ట్ చేశారు. పీడీఎస్ బియ్యం దారి మళ్లింపుపై జరిపిన తనిఖీల్లో సుమారు 5.8 లక్షల విలువైన 131 క్వింటాళ్ల బియ్యం, 27 క్వింటాళ్ల గోధుమలను స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని సంక్షేమ హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, అక్కడి లోపాలను సరిదిద్దాల్సిందిగా సంబంధిత శాఖలకు నివేదించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ సోమవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. గత నెలలో నిర్వహించిన ఆపరేషన్లతో ప్రభుత్వ ఆదాయానికి రూ.10.79 కోట్ల గండి పడిందన్నారు. అందులో ఇప్పటి వరకు రూ.1.96 కోట్లను వసూలు చేశామని తెలిపారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం చేసినా.. అక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ 14432‌కు తెలియజేయాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.