ఎస్సీ ఉప కులాలకు రిజర్వేషన్ ఫలాలు దక్కాలి
విద్య, ఉద్యోగాల్లోనే కాదు రాజకీయ రిజర్వేషన్లు సైతం ఎస్సీ ఉపకులాలకు దక్కాలి
పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలి
ఎస్సీ రిజర్వేషన్ల పెంపునకు దళిత సంఘాలతో కలిసి జాగృతి ఉద్యమిస్తుంది
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
ఎస్సీ ఉప కులాల నేతలతో సమావేశం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఎస్సీ ల్లో ఉపకులాలకు కూడా రిజర్వేషన్ ఫలాలు దక్కాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగాల్లో మాత్రమే కాకుండా రాజకీయాల్లోనూ వారికి రిజర్వేషన్లు దక్కాలన్న ఆమె ఎస్సీ ఉప కులాలకు రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఎస్సీ ఉప కులాల నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఎస్సీ ఉప కులాలకు రిజర్వేషన్ ఫలాలు దక్కాల్సిన అవసరముందన్నారు. పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీల జనాభా 15 శాతం నుంచి 18 శాతానికి పెరిగినట్టు గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ప్రస్తుత ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల గణనలో స్పష్టం అయిందన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసే క్రమంలోకేంద్రం చేపట్టే జనగణన లెక్కల కోసం ఎదురుచూస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని కవిత గుర్తు చేశారు. కేంద్ర జనాభా లెక్కలకు అనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. ఐతే అందుకు అనుగుణంగా రిజర్వేషన్ ల పెంపునకు అసెంబ్లీ లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం దళిత సంఘాలతో కలిసి జాగృతి పోరాటం చేస్తుందని చెప్పారు. ఎస్సీ ఉప కులాల్లో కొన్ని కులాలకు క్యాస్ట్ సర్టిఫికెట్ల జారీలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో 20 ఎస్సీ ఉప కులాల ప్రతినిధులు పాల్గొన్నారు.