Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్‌లో మాజీ మావోయిస్టుల చేరిక: బీజేపీకి విరుగుడుగా సానుభూతి వ్యూహం

బీజేపీకి విరుగుడు సూత్రం
కాషాయ జెండాకు ఎర్రజెండా ఎర
రాజకీయ ఆశల్లో మాజీ మావోయిస్టులు
వారిని ప్రోత్సహించే పనిలో సీఎం రేవంత్ రెడ్డి..?
రాజకీయాల్లో వస్తే స్వాగతించేందుకు రెడీ
తాము వస్తామంటున్న మాజీ మావోలు

ముద్ర, తెలంగాణ బ్యూరో :
సుదీర్ఘ పోరాటం.. ఏడు పదుల వయస్సుకు వచ్చి.. ఎర్రజెండాను వీడిని మాజీ మావోయిస్టు నేతలకు రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ఎర్ర తివాచీ పర్చేందుకు సిద్ధమవుతోంది. తామూ రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమే అంటూ రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారు. ఇదే అవకాశాన్నీ కాంగ్రెస్ ఒడిసిపట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్ మాజీ మావోయిస్టులను రాజకీయంగా ప్రోత్సహించేందుుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చారు. దీంతో మాజీ మావోయిస్టులు రాజకీయ రంగప్రవేశం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. వారికి సీఎం రేవంత్ అవకాశాలు కల్పించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సానుభూతి సూత్రం
సీఎం రేవంత్ రెడ్డి మావోయిస్టులపై సానుభూతి చూపిస్తున్నారు. లొంగిపోడానికి రెడ్ కార్పెట్ వేస్తున్నారు. మంచి పునరావాస ప్యాకేజీలు ఇస్తున్నారు. అయితే రాజకీయ నేతలు ఇదంతా ఊరికనే చేయరు. ఖచ్చితంగా రాజకీయం ఉంటుంది. రేవంత్ రెడ్డి మాజీ మావోయిస్టు అగ్రనేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించి రాజకీయ భవిష్యత్ ఇవ్వాలనుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయిని రాజకీయవర్గాలంటున్నాయి. మావోయిస్టులపై ప్రజల్లో ఎంతో కొంత సానుభూతి ఉటుందని.. బీజేపీ పూర్తిగా వ్యతిరేకంఅయింది కాబట్టి తమకు అనుకూలంగా మార్చుకునేందుకు లొంగుబాట్లకు ఎక్కువ ప్రాధాన్యం తెలంగాణలో కల్పించారని భావిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి అత్యంత ఆకర్షణీయమైన పునరావాస ప్యాకేజీలను ప్రకటించడం వెనుక స్పష్టమైన రాజకీయ సంకేతాలు ఉన్నాయని అనుకోవచ్చు. గతంలో మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన అగ్రనేతలను, వారి భావజాలంతో ప్రభావితమైన వర్గాలను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. కేవలం ఆర్థిక సాయంతోనే కాకుండా, వారిని గౌరవప్రదంగా సమాజంలో కలిపే ప్రయత్నం చేయడం ద్వారా ఒక రకమైన సామాజిక మద్దతు ను కూడగట్టుకునే ప్రయత్నం జరుగుతోందని అంచనా వేస్తున్నారు.

బీజేపీకి విరుగుడుగా సానుభూతి అస్త్రం
భారతీయ జనతా పార్టీ (BJP) మావోయిస్టు భావజాలాన్ని, లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ క్రమంలో మావోయిస్టుల పట్ల సానుకూల ధోరణిని ప్రదర్శించడం ద్వారా కాంగ్రెస్ ఒక భిన్నమైన రాజకీయ మార్గాన్ని ఎంచుకుంది. తెలంగాణ సమాజంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మావోయిస్టుల పట్ల ఇప్పటికీ ఎంతో కొంత సానుభూతి ఉంటుంది. ఈ వర్గాలను తమ వైపు తిప్పుకోవడం ద్వారా బీజేపీ హిందుత్వ ఎజెండాకు వ్యతిరేకంగా ఒక బలమైన సామాజిక కూటమిని నిర్మించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

రాజకీయ పునరావాసం – భవిష్యత్తు ప్రణాళిక
ఇటీవల మాజీ మావోయిస్టు అగ్రనేతలతో రేవంత్ రెడ్డి స్వయంగా సమావేశమవ్వడం, వారి రాజకీయ ఆకాంక్షల పట్ల సానుకూలంగా స్పందించినట్లుగా ప్రచారం జరుగుతోంది. మాజీ నక్సలైట్లు చట్టపరంగా రాజకీయాల్లోకి రావాలని ఆయన ఇచ్చిన సలహా, భవిష్యత్తులో వారికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇచ్చే అవకాశం ఉందనే సంకేతాలను పంపుతోంది. క్షేత్రస్థాయిలో పట్టున్న మాజీ నేతలను ఎన్నికల బరిలో దింపడం ద్వారా ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను చిత్తు చేయవచ్చని రేవంత్ భావిస్తున్నారు. అంటే, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాజీ మావోయిస్టులకు ఒక సురక్షితమైన రాజకీయ పునరావాస కేంద్రం గా మారే అవకాశం ఉందని అనుకోవచ్చు.

వ్యూహాత్మక ప్రయోజనం – దీర్ఘకాలిక ప్రభావం
మాజీ మావోయిస్టులను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్‌కు రెండు విధాల లాభం చేకూరుతుంది. ఒకటి, వారికున్న కేడర్ బలం పార్టీకి తోడవుతుంది. రెండు, అట్టడుగు వర్గాల గొంతుకగా కాంగ్రెస్ తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇది దోహదపడుతుంది. అయితే, ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందనేది భవిష్యత్తులో జరిగే ఎన్నికలే నిర్ణయిస్తాయి. ఒకవైపు ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవిస్తూనే, మరోవైపు సాయుధపోరాటం చేసి తప్పనిసరి పరిస్థితుల్లో లొంగిపోయిన వారిని తమ గూటికి చేర్చుకోవడం రేవంత్ రెడ్డి మార్కు పాలిటిక్స్‌.

Leave A Reply

Your email address will not be published.