ముద్ర, శేరిలింగంపల్లి:
మే నెలలో నిర్వహించే ఎప్ సెట్ పోటీ పరీక్షకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు టి-సాట్ నెట్వర్క్ ఈ నెల 26వ తేది గురువారం రోజు ప్రత్యేక లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. లైవ్ కార్యక్రమంలో తెలంగాణ ఎప్ సెట్ కన్వీనర్ కె.విజయ్ కుమార్ రెడ్డి పాల్గొని విద్యార్థినీ, విద్యార్థులకు పలు సలహాలు-సూచనలు అందించనున్నారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, కోర్సులలో చేరేందుకు తెలంగాణ ప్రభుత్వం కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ మే 13, 14 తేదిల్లో నిర్వహించనుంది. కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు తోడ్పాటుగా టి-సాట్ నెట్వర్క్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. టి-సాట్ నిపుణ ఛానల్ లో ఉదయం 11 నుండి 12 గంటల వరకు జరిగే లైవ్ కార్యక్రమంలో పాల్గొనే కన్వీనర్ విజయ్ కుమార్ విద్యార్థుల సందేహాలకు సమాధానం ఇవ్వడంతో పాటు సలహాలు అందించనున్నారు. ఎప్ సెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు వారి తల్లిదండ్రులు 040-23556037, 23553473 టోల్ ఫ్రీ నెం.1800 425 4038 నెంబర్లకు కాల్ చేయాలని టి-సాట్ నెట్వర్క్ కోరింది. ఇప్పటికే ఎప్ సెట్ పరీక్ష కోసం టి-సాట్ నెట్వర్క్ నాలుగు గంటల పాఠ్యంశాల ప్రసారాలను కొనసాగిస్తున్న విషయం పాఠకులకు విధితమే.
ఛైల్డ్ సేఫ్టీపై ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం
తెలంగాణ విద్యాశాఖలో భాగమైన సమగ్ర శిక్ష మరియు పోలీసు శాఖలో భాగమైన ఉమెన్ సేఫ్టీ వింగ్ సంయుక్తంగా ‘చైల్డ్ సేఫ్టీ’ పేరుతో గురువారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమం కొనసాగనుంది. పిల్లల రక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లలకు ఇబ్బందులు ఎదురైతే ఎవరిని సంప్రదించాలి, విద్యార్థి దశలో ఎటువంటి విషయాల జోలికి వెళ్లకూడదు అనే తదితర ప్రధాన అంశాలపై విద్యార్థులను చైతన్య పరిచే కార్యక్రమం టి-సాట్ విద్య ఛానల్ లో ఉదయం 11 నుండి 12 గంటల వరకు ప్రసారమౌతుంది. విద్యార్థినీ, విద్యార్థులు తమ సందేహాలు-సమాధానాల కోసం 040-2354 0326, 2354 0726 టోల్ ఫ్రీ నెం.1800 425, 4039 నెంబర్లకు కాల్ చేయాలి. టి-సాట్ నెట్వర్క్ ఈ మేరకు సూచించింది.