హనుమంత వాహన శేవలో దర్శనం..
కన్నుల పండువగా లక్ష్మీ నృసింహుని కల్యాణోత్సవం..
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
సత్యం, ధర్మం, త్యాగానికి ప్రతీక అయిన శ్రీరామ అలంకారంలో భక్తవత్సలుడు శ్రీ లక్ష్మీనరసింహుడు భక్తులకు దర్శనమిచ్చాడు.
బ్రహ్మోత్సవాలలో బుధవారం ఉదయం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం శ్రీ స్వామివారిని శ్రీరామ అలంకారం గావించి హనుమంత వాహన శేవలో అలంకరించి భక్తుల జయ జయ ద్వానాలతో తిరువీధులలో ఊరేగించారు. ఈ వేడుకలను శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా ఆలయ ప్రధానార్చకులు, ఉపప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, వేదపండితులు, అర్చకబృందం, పారాయణీకులు అత్యంత వైభవంగానిర్వహించగా వేడుకలలో కార్యనిర్వహణాధికారి జె.భవానీశంకర్, ఆలయ అను వంశికధర్మకర్త బి. నరసింహామూర్తి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరు ఎమ్.హనుమంతరావు ఉప కార్య నిర్వహణాధికారి, సహాయ కార్య నిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీరామ అలంకారము హనుమంత వాహన శేవ ప్రత్యేకత
శ్రీరామ అవతారమును త్యాగబ్రహ్మ వర్ణించుచూ ఎంత ముద్దో ! ఎంత సొగసో ! ఎవరి వల్ల వర్ణింపతగునో ! అని శ్రీరామచంద్ర స్వామి యొక్క ముగ్ధ మనోహర సౌందర్యము వర్ణింపబడుచున్నది. వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రుడిని పరివిధములుగా వర్ణిస్తూ “రిపూణాం అపి వత్సలః” అని పేర్కొనట రాముని కళ్యాణ గుణములను తెలియజేయుచున్నది. సీతమ్మవారు శ్రీరాముని పరాక్రమమును పేర్కొనుచు రావణుడితో “నృసింహంభీమసంకాశం అహంరామం అనువ్రతా” అని రాముడిని నృసింహ రూపంలో పేర్కొనుట ఎంతో విశేషమై ఉన్నది.
క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారు రామదూతగా స్వామిని తిరు వీధిలో ఊరేగింపు గావించుచు భక్తులను ఆనందింపజేయుట ప్రత్యేకతను కలిగియున్నది. శ్రీ స్వామి వారు కూడా భక్తపరాదీనుడనే భావనను ఈ హనుమంత వాహన సేవలో దర్శింపచేయుచున్నాడు.
సాయంకాలం గజవాహన శేవ
సాయంకాలం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యారాదనల అనంతరము రాత్రి శ్రీ స్వామివారిని ” గజవాహనశవ” లో శ్రీ స్వామి వారిని అమ్మవారలను అలంకరించి బ్రహ్మోత్సవ తిరు కళ్యాణ మహోత్సవమును ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు. వేద పండితులు, అర్చక బృందం, పారాయణీకులు అత్యంత వైభవంగా నిర్వహించెదరు.ఈ వేడుకలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఆలయ అధికారులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గజవాహన శేవ ప్రత్యేకత
శ్రీ స్వామివారిని తిరు కళ్యాణ మహోత్సవములో గజవాహన రూఢుడను గావించి తిరువీధులలో ఊరేగించుట ఎంతో ప్రత్యేకతను కలిగి ఉన్నది. గజము మరియు సింహము సహజ వైరులే అయినప్పటికీ భగవానుడి సన్నిధిలో వైర భావముండదని వాటి సహజీవనమే మానవకోటి ఆచరించవలసినది అని మరియు అది ధర్మమని వైరభావం వదిలిన సకల జగత్తు ఆనందదాయకమని ఈ అలంకార సేవ సూచించుచున్నది.
శ్రీ స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవ ప్రత్యేకత
ఉత్సవాల దేవుడిగా ప్రసిద్ధినొందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవము ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉన్నది. కళ్యాణమంటేనే ఆనందకారకమని లోకాలన్నీ భగవంతుడి యొక్క కళ్యాణ వేడుకలను వీక్షించి స్మరించి తరించుట ప్రసిద్ధమైనది. జగదానందనమును కలిగించమని దేవతలందరిని సపరివారంగా కళ్యాణ మహోత్సవానికి విచ్చేసి భక్తకోటిని ఆశీర్వదింప చేయమని ఆయా దేవతలను ఆహ్వానించి వారి శుభాశీస్సులు ఈ లోకానికి అందింపచేయుట మొదలగు అనేకములైన పుణ్యఫలములు ఈ కళ్యాణ వేడుకలో దర్శింపవచ్చును. కళ్యాణమహోత్సవంలో కళ్యాణమూర్తులైన శ్రీ స్వామివారిని అమ్మవారిని దర్శించిన ముక్తి కరతలామలకమని భక్తకోటి విశ్వసించుట, తమ మొక్కు కళ్యాణములను నిర్వహించుకొనుట అనాదిగా కొనసాగుతున్నది. శ్రీ స్వామి అమ్మవారల గోత్ర ప్రవరలు అచ్యుత సౌభాగ్య గోత్రములని వాటి వలన లోకంలోని సమస్త ప్రాణికోటి ప్రకృతి మండలం భగవత్ అనుగ్రహ పాత్రతను పొందగలదని పేర్కొనబడుచున్నది. ఎన్నో విశేషములను కలిగిన తిరు కళ్యాణ మహోత్సవ వైభవము వర్ణనాతీతమై భగవత్ సంపూర్ణ అనుగ్రహ ప్రదాతయై ప్రసిద్ధినొందియున్నది.
ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు (సాంస్కృతిక కార్యక్రమాలు)
శ్రీ వైష్ణవ సేవా సమాఖ్య యాదగిరిగుట్ట వారిచే విష్ణుసహస్ర నామ పారాయణం, శ్రీ వేంకటఅన్నమాచార్య సేవా ట్రస్ట్ వారిచే అలంకార సేవల ముందు కోలాటం, నృత్యములు, పుండరీక భక్త సేవా సమాజం, భూదాన్ పోచంపల్లి వారిచే భజన
శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మహిళాభజన మండలి, యాదగిరిగుట్ట
శ్రీ సాయి బాబా సేవాసమితి, రామంతాపూర్ వారిచే మంగళవాద్యము,
చేబ్రోలు.నారాయణదాస్ భాగవతార్ గారు, (హాలియా) వీరు భీష్మ ప్రతిజ్ఞ హరికథాగానము చేశారు.