మోడీ ప్రభుత్వానిది నియంతృత్వ పాలన.
అహంకారంతోనే కొమ్మెర ఘటన.
రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి భరోసా ఇవ్వాలి.
సంక్షేమ పథకాల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలి.
కాలేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మత్తులు చేపట్టాలి.
సిపిఐ జాతీయ నాయకుడు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి.
దేశంలో మావోయిస్టుల ఏరివేత అసాధ్యమని, అసమానతలు,ఆకలి కేకలు ఉన్నన్ని రోజులు ఉద్యమాలు నడుస్తూనే ఉంటాయని,మావోయిస్టులను అంతం చేయడం సాధ్యమని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో పరిపాలన కొనసాగిస్తుందని సిపిఐ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు.
బుధవారం నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మావోయిస్టుల ఏరివేత పై డెడ్ లైన్ పెట్టి, పోలీసులను ఉసిగొల్పటం అప్రజాస్వామికమని అన్నారు. రాజ్యాంగబద్ధ పాలన వీడి, నియంతృత్వ పాలనతో దేశంలో అలజడి రేపెందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
వేలాది మంది పోలీసుల బూట్ల చప్పుళ్ళతో,తుపాకీ తూటాలతో సామాన్య అమాయకులు సమిదలవుతున్న నేపథ్యంలో మావోయిస్టులు తీసుకుంటున్న నిర్ణయం తాత్కాలిక విరామమే కానీ,ఉద్యమం అంతం కాదని తేల్చి చెప్పారు.
కరీంనగర్ పార్లమెంటు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మావోయిస్టుల పట్ల చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు సమర్థనీయం కాదని అవి ఆయన అవివేకానికి నిదర్శనమని అన్నారు.
మావోయిస్టుల ఏరివేత బిజెపి పార్టీకి గగనకుసుమంగా మారుతుందని స్పష్టం చేశారు. రజాకార్లతో పోరాడి కమ్యూనిస్టులు చేసిన రక్త తర్పణం, సాయుధ పోరాటం, త్యాగాల చరిత్ర కలిగిన తెలంగాణలో రాజకీయ పట్టు సాధిస్తామని అనుకోవటం కలగా మారుతుందన్నారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బిజెపి పాలన సాగించేందుకు ఎంతకైనా వెనుకాడేది లేదనే రీతిలో వ్యవహరించటం సిగ్గుచేటని విమర్శించారు.
ఉచితాలపై ఓవైపు సుప్రీం కోర్టు చివాట్లు పెడుతున్నా , పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పాగా వేసేందుకు ఇప్పటినుంచి కుట్రలు కుతంత్రాలకు తెరలేపుతున్నదని, ఉచిత పథకాల పేర అక్కడి ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుత పోటీ యుగంలో మానవ రహితంగా రాకెట్లు అంతరిక్షంలోకి దూసుకుపోతుంటే, తెలంగాణలో ఇంకా కుల రక్కసి రాజ్యమేలుతుండడం శోచనీయమని అన్నారు. సామాజిక అసమానతలు సృష్టిస్తూ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు కొన్ని వర్గాలు పావులు కదుపుతున్నాయని, ఇందుకు నిదర్శనమే నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మెర గ్రామంలో ఇటీవల జరిగిన ఉదంతమని అన్నారు. అగ్రవర్ణ అహంభావానికి రెండు నెలల చిన్నారి బలి కావడం దురదృష్టకరమన్నారు. ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని,ఎఫ్ఐఆర్ కాపీని విడుదల చేయాలన్నారు.
రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని,రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని, గత ప్రభుత్వం ప్రారంభించిన పెట్టుబడి సాయం రైతుబంధు పథకాన్ని, రైతు భరోసాగా మార్చి సాయం మరింత పెంచినా విడుదల చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని,. పొలాలు దున్ని నాట్లు వేసి కలుపు తీసిన, పంట కోతకు వచ్చినా ఇప్పటివరకు యాసంగి రైతు భరోసా మొత్తం రైతుల ఖాతాలో జమకాక పోవడం దారుణమని,రైతు బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిన మేనిఫెస్టోలో పొందుపరిచిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ సక్రమంగా అమలు చేయకపోవడం సముచితం కాదన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
రెవెన్యూ యంత్రాంగాన్ని పటిష్టం చేసి భూభారతి పథకాన్ని వెంటనే అమలు చేయాలని అన్నారు.
సాదా బైనమాలతో కబ్జాలో ఉన్న వారికి పట్టాలు అందించాలని కోరారు. తెలంగాణ వరప్రదాయిని అంటూ చెప్పుకునే కాలేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరంగా మారడంతో, ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు తిరిగి పూర్వస్థితికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాలేశ్వరం తో పాటు దేవాదుల , మల్లన్న సాగర్ ప్రాజెక్టులకు మరమ్మత్తులు చేసి నీటిని పంపింగ్ చేయాలని సూచించారు.
విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి,కొయ్యడ సృజన్ కుమార్,బోయిని అశోక్,టేకుమల్ల సమ్మయ్య, నాగెల్లి లక్ష్మారెడ్డి,బోయిని తిరుపతి,న్యాలపట్ల రాజు, ఏ ఐ ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి,సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు,కటికరెడ్డి బుచ్చన్న యాదవ్,బీర్ల పద్మ,నాయకులు గామినేని సత్యం,కూన రవి, శాంత కుమార్ తదితరులు పాల్గొన్నారు