ముద్ర, హైదరాబాద్: మెహిదీపట్నం సమీపంలోని నేతాజీ నగర్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి సందర్భంగా కాలనీవాసులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. నేతాజీ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షుడు జి అప్పారావు అధ్యక్షత వహించారు. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఏ. కృష్ణమూర్తి నేతాజీ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అసోసియేషన్ నాయకులు అప్పారావు, కృష్ణమూర్తి, అంజిరెడ్డి, టీఎస్ ఆనంద రెడ్డి, వై నరేందర్ రెడ్డి, డాక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ సాయుధ పోరాట మార్గంలో దేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించడానికి నేతాజీ చేసిన కృషిని వివరించారు. ఉన్నతమైన ఉద్యోగాన్ని త్యజించి సమర రంగంలోకి దూకిన సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ పౌజ్ ద్వారా చేసిన పోరాటం బ్రిటిష్ పాలకుల గుండెల్లో గుబులు పుట్టించిందని అన్నారు. ఆయన చేసిన పోరాటం ప్రత్యక్షంగా ఫలించకపోయినా స్వాతంత్రం రావడాన్ని వేగిర పరిచిందని వారు పేర్కొన్నారు. నేతాజీ పట్టుదల, త్యాగం ఎల్లవేళలా స్ఫూర్తిగా నిలుస్తాయని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో కే శ్రీధర్, ఏం రంగారెడ్డి, కేవీబీ మురళీమోహన్ రావు, టి సురేందర్, ఎల్ దామోదర్, సంజీవరెడ్డి, వెంకటరమణ, అక్షర పాఠశాల విద్యార్థులు పాల్గొని నేతాజీకి నివాళులర్పించారు.