- దేశవ్యాప్త జన, కులగణనకు కేంద్రం నిర్ణయం.
- రాష్ట్రాల కులగణనలో పారదర్శకత లేదనే అభిప్రాయంతో కేంద్రం.
- తెలంగాణలోనూ నిర్వహించేందుకు కసరత్తు.
- ఇప్పటికే రాష్ట్ర కులగణనను వ్యతిరేకించిన బీసీ సంఘాలు.
- బీసీ జనాభా తక్కువ చేసి చూపించారని ఆరోపణలు.
- కేంద్ర నిర్ణయంపై రాష్ట్ర సర్కార్ అలర్ట్.
- ఇప్పటికే కులగణనపై అసెంబ్లీలో తీర్మానం.
- 42శాతం బీసీ రిజర్వేషన్లపై మొదలైన అనుమానాలు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన కుల, బీసీ గణన అంశం మళ్లీ మొదటికి రానుందా..? త్వరలోనే దేశ వ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన నిర్వహణ విషయంలో బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో అధికార పార్టీని కలవరపెడుతోందా..?ఇప్పటికే పలు రాష్ట్రాలు నిర్వహించిన కులగణనలో పారదర్శకత లేదనే అభిప్రాయంతో ఉన్న కేంద్రం కులగణన చేసిన రాష్ట్రాల పట్ల ఏ విధంగా స్పందిస్తుంది..? కేంద్ర కులగణనలో తెలంగాణకు మినహాయింపు ఉంటుందా..?ఒకవేళ కేంద్రం రాష్ట్రంలో మళ్లీ కులగణన నిర్వహణకు సిద్ధమైతే కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన గణన సంగతేంటీ..?రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కులగణనను వ్యతిరేకించిన బీసీ సంఘాలు తమ జనాభాను తక్కువ చేసి చూపించారని చేస్తోన్న ఆరోపణల్లో వాస్తవాలు కేంద్ర చేపట్టే గణనలో నిగ్గు తేలుతాయా..?కులగణన ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన ప్రతిపాదనను ఉభయ సభల్లో ఆమోదం తెలిపి బిల్లును ఆమోదించుకున్న కాంగ్రెస్ పరిస్థితేంటీ..?కేంద్రం కోరితే తాము పారదర్శకంగా నిర్వహించిన కులగణనపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సిద్ధమంటోన్న కాంగ్రెస్ సర్కార్ అనుభవాలను కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందా..? ఇప్పుడీ చర్చ రాష్ట్ర రాజకీయాలతో పాటు అన్ని వర్గాల్లో ఆసక్తి, ఉత్కంఠను రేపుతున్నది.కులగణన అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాల కులగణన సర్వేలకు పారదర్శకత లేదని కేంద్రమంత్రి అశ్వినీవైష్ణవ్ వ్యాఖ్యానించడం సంచలనం రేపుతోంది.దీంతో తెలంగాణ ప్రభుత్వం చేసిన సర్వే ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ సర్వే రద్దు చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- మినహాయిస్తారా? రద్దు చేస్తారా?
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టబోతున్నట్లు మోదీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇప్పటికే తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలు కులగణన చేపట్టగా వీటిని మినహాయిస్తారా? లేక మొత్తం రద్దు చేసి కొత్తగా నిర్వహిస్తారా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది.ఇప్పటికీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోగా పలు రాష్ట్రాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసమే కులగణన నిర్వహించాయని కేంద్ర ప్రభుత్వం విమర్శలు చేస్తుంది. ఇందులో భాగంగానే కేంద్రమంత్రి అశ్వినీవైష్ణవ్ కేంద్ర మంత్రివర్గం తదుపరి జనాభా లెక్కల్లో కులాన్ని లెక్కించాలని నిర్ణయించిందని చెప్పారు. అయితే పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన కులగణన కేవలం సర్వేలు మాత్రమే అన్నారు.
- తేడాలున్నాయా..?
‘జనగణన కేంద్ర పాలిత అంశం కానీ కొన్ని రాష్ట్రాలు కులగణన చేశాయి. అందులో కొన్ని పారదర్శకంగా చేస్తే మరికొన్ని రాష్ట్రాలు దీనిని పూర్తిగా రాజకీయ కోణంలోనే నిర్వహించాయి.కులాన్ని లెక్కించడానికి బీహార్, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు ప్రయత్నించాయి. దేశవ్యాప్తంగా కేంద్రం 2,650 ఓబీసీ కమ్యూనిటీల లిస్ట్ తయారు చేయగా, రాష్ట్రాల్లో మాత్రం 3,651 కంటే ఎక్కువ కమ్యూనిటీలు వర్గీకరించబడ్డాయి. అందుకే మరోసారి ఈ అంశాలను పరిశీలించాల్సి ఉందంటూ కేంద్ర మంత్రి కూడా అన్నారు.దీంతో తెలంగాణతోపాటు ఆయా రాష్ట్రాలు నిర్వహించిన కులగణన రద్దు చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి.
- బీసీలకు 42 శాతం రిజర్వేషన్ రద్దు?
ఇదిలా ఉంటే.. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది.కానీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ రిజర్వేషన్ అమలుపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు జనాభాగణన 7వ షెడ్యూల్ కేంద్ర జాబితాలోని అంశం. 1948 జనాభాగణన చట్టం ప్రకారం సర్వే చేప్టటే అధికారం కేంద్రానికి మాత్రమే ఉంది.జనాభాగణన నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదు. రాష్ట్రాలు చేపట్టినా దానికి చట్టబద్ధత ఉండదు. 2008 చట్టం ప్రకారం 7వ జాబితాలోని జనాభాగణనను రాష్ట్రాలు నిర్వహించకూడదు.అది రాష్ట్రాల పరిధిలోకి రాదు.ఈ నేపథ్యంలో రేవంత్ సర్కారు నిర్వహించిన ‘ఇంటింటి సర్వే’ కూడా రద్దు కానున్నట్లు తెలుస్తోంది.ఎక్కడైనా చేపట్టే ఈ సర్వేకోసం ప్రామాణికమైన డేటా ఓటర్, ఆధార్, రేషన్‌కార్డు తదితర జాబితాలను పరిశీలించాల్సి ఉంటుంది.ప్రజల సామాజిక,ఆర్థిక, విద్య,ఉద్యోగ,ఉపాధి,రాజకీయ అవకాశాలకు సంబంధించిన స్థితిగతులపై అధ్యయనం చేసి, వీటన్నింటి ఆధారంగా నివేదిక రూపొందిస్తారు.ఆ నివేదికకు క్యాబినెట్ ఆమోదం తెలిపితే ఆ తర్వాత కేంద్రం ఆమోదం పొందితేనే ఆ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటారు.అయితే, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో 2024 నవంబర్‌లో ఇంటింటి సర్వే చేపట్టింది. కానీ ఈ గణాంకాలపై విమర్శలు రావడంతో రీ సర్వే చేపట్టింది.రీ సర్వే అంశాలను ఇంకా పరిశీలిస్తూనే ఉన్నారు.ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సర్వేపైనా కేంద్రం ఏ నిర్ణయం తీసుకోనుందనే అంశం ఆసక్తికరంగా మారింది.
- ఆమోదించారా..?
మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ ఉభయ సభల్లో బిల్లు చేసి గవర్నర్‌కు పంపింది.ఈ బిల్లును గవర్నర్ ఆమోదించారని చెప్పుతున్న ప్రభుత్వం.. దాన్ని గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పంపించారని ప్రకటించారు.ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం 10:30 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ బీసీ నేతలు- మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, సీనియర్ నేత కేశవరావు, మధుయాష్కితో పాటుగా బీసీ నేతలు నేడు గవర్నర్‌తో భేటీ కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ లకు రాజకీయ, విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ ఉభయ సభల్లో చేసిన బిల్లుకు ఏప్రిల్ 8న గవర్నర్ ఆమోదం పొంది రాష్ట్రపతికి పంపడంతో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కి ధన్యవాదాలు తెలపనున్నట్లు ప్రకటించారు.అయితే, ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల, బీసీ గణనను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రంతో ఏ మేరకు పోరాటం చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.