ముద్ర, ఖమ్మం :
మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు ప్రజాపాలనకు ప్రజలు పట్టం కట్టిన తీర్పు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్రం మొత్తం వ్యక్తమైన ఈ ఆదరణ రానున్న మార్పుకు సంకేతమని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. వారి అభిమానాన్ని వమ్ము కానివ్వకుండా మరింత బాధ్యతతో, మరింత కట్టుబాటుతో పనిచేస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం విడుదలైన ‘పుర’ ఫలితాలపై ఆయన ఖమ్మంలో మీడియా ప్రకటన విడుదల చేశారు. నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడు అది ఆదరణగా మారుతుందని ప్రజలు మరోసారి నిరూపించారని తెలిపారు. ప్రజా ప్రభుత్వం గత రెండేళ్లుగా విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతులు వంటి కీలక రంగాల్లో సాధికారత లక్ష్యంగా అవిశ్రాంతంగా పనిచేస్తోందన్నారు. ఈ గెలుపు ఆ కృషికి లభించిన గౌరవమన్నారు. నిష్కల్మష నాయకత్వం, పారదర్శక పరిపాలన, సమష్టి కృషే ఈ విజయానికి పునాదులని చెప్పారు. ఈ ఎన్నికల్లో కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా శ్రమించారన్న భట్టి… ప్రజలు అభివృద్ధికి మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. మధిర నియోజకవర్గం తనకు రాజకీయ ప్రస్థానం మాత్రమే కాదన్న భట్టి.. తన ప్రాణం అన్నారు. మధిర ప్రజలు చూపించిన అపారమైన ప్రేమ, అచంచలమైన విశ్వాసం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మున్సిపల్ ఎన్నికల్లో 22 స్థానాల్లో 21 స్థానాల్లో అఖండ విజయాన్ని అందించిందని చెప్పారు. ఈ విజయాన్ని మరింత బాధ్యతగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు.