ఏ సంస్థలో పనిచేసే ఉద్యోగులైనా, ఉపాధ్యాయులైనా, కార్మికులైనా ఆ సంస్థ అభివృద్ధిలో భాగస్థులై పనిచేస్తుంటారు.ఆ క్రమంలో వారు ఆర్థికంగా,సామాజిక భద్రతతో కూడిన ఆరోగ్యకరమైన జీవనాన్ని కోరుకుంటారు.అది రాజ్యాంగ పరంగా,కార్మిక చట్ట పరంగా వాళ్ళకు సంక్రమించిన న్యాయమైన హక్కు.తమ వద్ద పని చేసే వారి సంక్షేమం కొరకు కృషి చేయడం ప్రభుత్వం లేదా యాజమాన్యం యొక్క బాధ్యత.ఆ సంక్షేమంలో భాగంగా కాలానుగుణంగా జీతాల పెంపు,కరువుభత్యం వంటివి ప్రకటించి ఆర్ధిక పరిపుష్టిని కలిగించడం, పదోన్నతులు కల్పించడం, ఆరోగ్య సంరక్షణ వంటి పథకాలను అమలు చేయడం వంటివి చేయాలి.ఉద్యోగులు కూడా ప్రజలే.కాబట్టి ఉద్యోగ సంక్షేమం ప్రజా సంక్షేమంలో భాగంగానే ప్రభుత్వం గుర్తించాలి.అయితే కొన్నిసార్లు ఆయా ప్రభుత్వాలు, యాజమాన్యాలు న్యాయంగా ఉద్యోగులకు లభించాల్సిన వాటికి ఇవ్వకుండా వారి హక్కులను కాలరాస్తూ తాత్సారం చేస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నపుడు ఆయా వర్గాలకు ప్రాతినిధ్యం వహించే సంఘాలు రంగంలోకి దిగి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడి హక్కులను కాపాడుకుంటాయి. ఉద్యోగుల న్యాయపరమైన సౌకర్యాలను పొందుతాయి. ఉద్యోగ,ఉపాధ్యాయ,కార్మిక సంఘాల ఉద్యమం చరిత్రలో ఇట్లాంటి సంఘటనలు కోకొల్లలు. సంఘేశక్తి’: ‘అన్నట్లుగా సంఘ బలానికి మించిన బలం లేదని నిరూపించాయి.
అటువంటి గొప్ప చరిత్ర కలిగిన సంఘాలు ఉండి కూడా నేడు ఉద్యోగ,ఉపాధ్యాయులకు న్యాయంగా రావలసిన PRC, DAలు గురించి పదే పదే అడుక్కోవలసిన పరిస్థితి. అట్లాగే ఏండ్ల తరబడి సమస్యలు పేరుకుపోవడం, ఉద్యోగ విరమణ తరువాత ఆర్థికంగా సామాజిక భద్రతను కల్పించే పెన్షన్ హక్కును కోల్పోడం.CPS విధానం రద్దు కాకపోవడం, ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆరోగ్య సంరక్షణకై అన్ని కార్పోరేట్ ఆసుపత్రులలో చెల్లుబాటయ్యే అయ్యే విధంగా ఆరోగ్య కార్డులను మంజూరు చేయడ, విద్యారంగాన్ని ప్రయోగశాలగా మార్చి అసమగ్రంగా ఉన్న CCE విధానం లాంటివి ప్రవేశపెట్టి అమలు చేయడం వంటి ఎన్నో మరెన్నో సమస్యలు పరిష్కారం కాక పోవడానికి కారణం ఏమిటి? ఎన్నాళ్ళీ చలనం లేని బతుకు? ఈ వైఫల్యం ప్రభుత్వానిదా? సంఘాలదా? అని అంతరాత్మలో ప్రశ్నించు కోనే ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు కారణాలను అన్వేషించాలి.అధ్యయనం చేయాలి. విశ్లేషించుకొని వాస్తవాలు గ్రహించాలి.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెసు సర్కారు ఏర్పడి రెండేళ్లు దాటిని ఉపాధ్యాయుల సమస్యకు ఎక్కడ వేసినా గొంగడి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశగా ఓపికగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ కార్యాచరణ దిశగా అడుగులు వేస్తున్నాయి.
కాలమెప్పుడూ ఒకే తీరుగా ఉండదు. తమ అపరిష్కృత సమస్యలపై ఉద్యోగ ఉపాధ్యాయులకు అసహనం పెరిగింది.ఉద్యమ నేపథ్యం కలిగిన సంఘాలవైపు ఉపాధ్యాయుల ఆశగా చూస్తున్నారు.ఆ క్రమంలోనే ఉద్యము చరిత్ర కలిగిన ఎస్టీయూ, యూటిఎఫ్ వంటి సంఘాలు భావ సారూప్యత కలిగిన మరికొన్ని సంఘాలలో జాక్టో యూ.ఎస్.పి.సి గా ఏర్పడి కొన్ని ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలతో కలిసి అతి పెద్ద కూటమిగా ఏర్పడి సమస్యల పరిష్కారం ఉద్యమించుటకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది.
ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ,పెన్షనర్ల సమస్యలను తాత్సారం చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఐదు డిఏ లు పెండింగ్ లో ఉన్నాయి.ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం ముప్పై సంవత్సరాలకు పైగా సర్వీసు చేసిన ఉద్యోగులకు ఉద్యోగ విరమణ బకాయిలు చెల్లించకపోవడం తదితర సమస్యలతో విసిగి వేశారిపోయిన ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల వారు ఉద్యమ సంఘాలు ఎప్పుడూ ధర్నాకు పిలుపునిస్తాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఉపాధ్యాయుల న్యాయమైన హక్కులను సాధించుట కొరకు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడానికి పైరవీకారులను నిరోధించడానికి ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్యవేదికలు ఏర్పడ్డాయి.ఈ పోరాట సంఘాల ఐక్యవేదికలకు అండగా నిలుద్దాం. మన హక్కులను కాపాడుకుందాం. సమస్యలను పరిష్కరెయ కుందాం.ఆ దిశలో సీనియర్ ఉద్యమ సంఘంగా ఎస్టీయూ సమస్యల పరిష్కారానికి కీలక భూమిక పోషిస్తున్నందుకు ఎస్టీయూ సభ్యులుగా మనందరం గర్వించాలి.
* సుధాకర్.ఏ.వి
* రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు
* స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్(STUTS)
* 9000674747