తమిళనాడు కానిస్టేబుళ్లకు తీవ్ర అవమానాలు జరుగుతున్నాయని ఆవేదన
బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలుగు రాష్ట్రాల్లోని వివిధ కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నాంపల్లి, రాజమండ్రి, కరీంనగర్ ప్రాంతాల్లోని కోర్టుల్లో బాంబులు పెట్టామని అగంతకుల నుంచి ఈమెయిల్స్ అందాయి. తాము అమర్చిన ఆర్డీఎక్స్ బుధవారం మధ్యాహ్నం 12:05 గంటలకు పేలుతాయని అగంతకులు అందులో పేర్కొన్నారు. దీంతో ఆయా కోర్టుల్లో తీవ్ర ఆందోళన రేపింది. వెంటనే రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ కోర్టుల్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల తర్వాత ఇదంతా ఉత్తదే అని తేల్చారు. అగంతకుల నుంచి వచ్చిన బెదిరింపు ఈమెయిల్స్ తమిళనాడు పోలీసు సిబ్బంది పేరుతో రావడం సంచలనంగా మారింది. ఈ మెయిల్ లో అగంతకులు పలు ఆరోపణలు చేశారు. ఇందులో తమిళనాడు కానిస్టేబుళ్లకు తీవ్ర అవమానాలు జరుగుతున్నాయని తమ చేత నివేతా పేతురాజ్, డీఎంకే నేతల ఉంపుడు గత్తెల బట్టలు, వారి ఇళ్లలోని మురికి పాత్రలను బలవంతంగా శుభ్రం చేయిస్తున్నారని ఆరోపించారు. తమిళనాడులో కానిస్టేబుళ్ల కోసం 1979 నైనార్ దాస్ పోలీస్ యూనియన్ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు ఈ సందేశంలో పేర్కొన్నారు. తమ డిమాండ్లు వినిపించడానికి మరో మార్గం లేదని అందుకే బాంబు పేలుళ్లకు పాల్పడుతున్నామని పేర్కొన్నారు. సీ-4 ఆర్డీఎక్స్ తో తయారు చేసిన 3 ఆర్డీఎక్స్ ఐఈడీలు ఇప్పటికే న్యాయమూర్తి/కోర్టు ప్రాంగణంలోని కీలక ప్రాంతాల్లో అమర్చబడ్డాయని చెప్పారు. మధ్యాహ్నం సమయంలో కోర్టు కార్యాలయం వద్దకు ఒకరిద్దరు సభ్యులు సమీపిస్తారన్నారు. క్యూబ్రాంచ్-ఐఎస్ఐ సభ్యులు రిమోట్ కంట్రోల్ ట్రిగ్గర్లు తీసుకుని ప్రాంగణానికి 100 అడుగుల లోపలికి రాగానే ఐఈడీలు వాటంతట అవే పేలిపోతాయని తెలిపారు.
అవి పేలకపోతే మా సభ్యులే పేల్చుకుంటారు.
ఏదైనా కారణంగా అవి పేలని పక్షంలో మా సభ్యులే భవనంలోకి వచ్చి శ్రీలంక ఈస్టర్ ఆపరేషన్ తరహాలో సిబ్బందితో కలిసి తమను తాము పేల్చుకుంటారని బెదిరించారు. ఏపీ కోర్టు సులభమైన లక్ష్యం అని ఎట్టి పరిస్థితుల్లో మా డిమాండ్లు వినిపిస్తామంటూ మెయిల్ చేశారు. ఆకాశ్ భాస్కరన్ పట్టుబడితే, నివేతా పేతురాజ్ కూడా పట్టుబడుతుంది. కాబట్టి, దానికి ముందు ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని పేర్కొన్నారు. అరుణ్ కుమార్, సున్నియా దాస్ ప్రసాద్ మాజీ క్యూబ్రాంచ్ (సీబీ-సీఐడీ II) ఇన్స్పెక్టర్ (86వ బ్యాచ్) నాగపట్టణం పేరుతో ఈ బెదిరింపు మెయిల్ పోలీసులకు చేరింది. అయితే నిజంగానే ఇదితమిళనాడు పోలీసులకు జరుగుతున్న అవమానాల విషయానికి సంబంధించిందేనా లేక ఎవరైనా అగంతకులు ఇలా చేశారా అనేది పోలీసుల విచారణలో తేలనుంది.