రూ. 55.73 కోట్ల అంచనాలతో అభివృద్ధి వైపు అడుగులు
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మున్సిపల్ 2026-27 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్‌ను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. సోమవారం మున్సిపల్ కార్యాలయ కౌన్సిల్ హాలులో చైర్పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి అధ్యక్షతన నిర్వహించిన బడ్జెట్ ప్రత్యేక సమావేశం, అత్యవసర కౌన్సిల్ సమావేశం విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశానికి స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అందరి సహకారంతో పట్టణ అభివృద్ధి: ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి
ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టమని, కౌన్సిల్ సభ్యులందరూ రాజకీయాలకు అతీతంగా పట్టణ అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. వార్డుల్లో నెలకొన్న మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.
ఆదాయ వనరులపై కలెక్టర్ దృష్టి
సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ మున్సిపాలిటీ స్వయం సమృద్ధి సాధించాలంటే ఆదాయ వనరులను పెంచుకోవాలని సూచించారు. బకాయి పన్నులను పూర్తిస్థాయిలో వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కౌన్సిల్‌లో మహిళా సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ, మహిళా సాధికారతకు ఇది ఒక నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
రూ. 55.73 కోట్ల బడ్జెట్ వివరాలు:
కౌన్సిల్ ఇన్చార్జి మున్సిపల్ కమీషనర్ వై. కొండల రావు 2026-27 సంవత్సరానికి సంబంధించిన ఆదాయ, వ్యయాల అంచనాలను సభ ముందు ఉంచారు.
ప్రారంభ నిల్వ: రూ. 24.87 కోట్లు
అంచనా ఆదాయం: రూ. 56.03 కోట్లు
మొత్తం నిల్వ: రూ. 80.90 కోట్లు
ప్రతిపాదిత వ్యయం: రూ. 55.73 కోట్లు
ముగింపు నిల్వ: రూ. 25.17 కోట్లు
కోతులు, కుక్కల బెడదకు చెక్
పట్టణ ప్రజలను ఎంతో కాలంగా వేధిస్తున్న కుక్కలు మరియు కోతుల సమస్యపై కౌన్సిల్ సభ్యులు చర్చించగా, కలెక్టర్ స్పందిస్తూ.. ఈ సమస్య పరిష్కారానికి తగిన నిధులు కేటాయించి, శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అంతకుముందు కౌన్సిల్ ఏజెండాలోని 11 అంశాలను సభ్యులు సుదీర్ఘంగా చర్చించి ఆమోదించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు, వైస్ చైర్పర్సన్ పోతంశెట్టి మంజుల, వివిధ వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.