ముద్ర మల్కాజిగిరి:
మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధి , ప్రజా సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కీలక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌లను మంగళవారం కలిసి నియోజకవర్గంలోని పలు సమస్యలపై సమగ్రంగా చర్చించారు.
ఈ సమావేశంలో ప్రధానంగా భూకబ్జాలు, అభివృద్ధి పనులకు ఎదురవుతున్న ఆటంకాలు వంటి అంశాలను ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా చర్చించిన ముఖ్య అంశాల్లో అల్వాల్‌లో ఫైర్ స్టేషన్ నిర్మాణానికి కేటాయించిన 11 గుంటల స్థలంపై కోర్టు స్టే కారణంగా పనులు నిలిచిపోవడం, మల్కాజ్‌గిరి డివిజన్‌లోని విమల దేవి నగర్‌లో బావిని మూసివేసి అక్రమ నిర్మాణం చేపట్టడం, చెరువుల పరిరక్షణ , ఆధునీకరణ పనులు నిలిచిపోవడం ఉన్నాయి. అలాగే బండ చెరువు పరిరక్షణ, స్మశానవాటికల అభివృద్ధి, బాక్స్ డ్రైన్లు , సీసీ రోడ్ల నిర్మాణం వేగవంతం, పార్కుల అభివృద్ధి, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై కూడా చర్చించారు.
ఈ సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందిస్తూ, త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు నిరుగొండ జగదీష్ గౌడ్, చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, మురుగేష్, మేకల రాము యాదవ్ తదితరులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.