అల్లాపూర్ శివయ్య బస్తీలో టీపీసీసీ ఉపాధ్యక్షుడి పర్యటన
ముద్ర కూకట్‌పల్లి :
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాము నిరంతరం శ్రమిస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ స్పష్టం చేశారు. ఆదివారం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శివయ్య బస్తీలో స్థానిక నాయకులు లక్ష్మణ్ గౌడ్, నరసింహా యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన విస్తృతంగా పర్యటించి ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా స్థానికులు పలు ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు బోరబండ రైల్వే స్టేషన్ పరిసరాల్లో రౌడీ మూకలు, సంఘ విద్రోహ శక్తులు గంజాయి, మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, దీనివల్ల మహిళలు, పిల్లలు బయటకు రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.బస్తీలో చెత్త తరలింపు సక్రమంగా జరగడం లేదని, రోజుల తరబడి పేరుకుపోయిన వ్యర్థాలతో దుర్వాసన వ్యాపించి రోగాల బారిన పడుతున్నామని ఫిర్యాదు చేశారు.ప్రజల ఫిర్యాదులపై బండి రమేష్ తక్షణమే స్పందించారు. అక్కడి నుంచే సంబంధిత పోలీస్, రైల్వే మరియు జీహెచ్‌ఎంసీ
అధికారులతో ఫోన్లో మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని, పారిశుధ్య సమస్యను వెంటనే పరిష్కరించి స్థానికులకు ఊరటనివ్వాలని అధికారులను ఆదేశించారు. ఆయన తక్షణ స్పందన పట్ల బస్తీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ పర్యటనలో కాంగ్రెస్ నాయకులు లక్ష్మయ్య,, కొప్పిశెట్టి దినేష్, బర్కత్ ఆలీ, నరసింహ, మన్సూర్, సఫీ, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.