ముద్ర కూకట్‌పల్లి :
పొగడ్తలు, డప్పుల మోతలు, శివసత్తుల పూనకాలతో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియం మారుమోగింది. ‘ప్రేమాక్షరి’ పుస్తకావిష్కరణ సభలో లలిత కళా పీఠం ఫోక్ ఆర్ట్స్ విద్యార్థులు ప్రదర్శించిన బోనాల జాతర ప్రదర్శన ఆహూతులను మంత్రముగ్ధులను చేసింది.
సాంబ్రాణీ పొగ, కల్లు సాకలు, పోతరాజుల విన్యాసాలతో వేదికపైనే పల్లెటూరి జాతరను సాక్షాత్కరింపజేశారు.
“రావే రావే పెద్దమ్మా..”, “మమ్ము చల్లగా చూడే ఎల్లమ్మ” అంటూ విద్యార్థులు పాడిన పాటలు, చేసిన నృత్యాలు ఆడిటోరియంలో భక్తిభావాన్ని నింపాయి.బోనాల ప్రదర్శనతో పాటు చివరగా విద్యార్థులు ప్రదర్శించిన లంబాడీ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిండి
ఈ సందర్భంగా వర్సిటీ ఉపకులపతి ఆచార్య వెలుదండ నిత్యానందరావు మాట్లాడుతూ.. తన జీవితంలో అత్యంత శ్రద్ధగా వీక్షించిన ప్రదర్శన ఇదని విద్యార్థులను కొనియాడారు. నేటి తరం విద్యార్థుల్లో కూడా కళల పట్ల గొప్ప శ్రద్ధాశక్తులు ఉన్నాయని, దానికి ఈ ప్రదర్శనే నిదర్శనమని ఆయన ప్రశంసించారు.
సీనియర్ సంపాదకులు కె. శ్రీనివాస్ మాట్లాడుతూ.. “కళ అనేది సమాజానికి మంచి చెడులను వివరించే గొప్ప కమ్యూనికేషన్ సాధనం” అని పేర్కొన్నారు. పీఠాధిపతి డాక్టర్ విజయ్‌పాల్ పర్యవేక్షణలో విద్యార్థులకు అందుతున్న శిక్షణను ప్రముఖులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు, డీన్ ఆచార్య బి.హెచ్. పద్మప్రియ, వివిధ విభాగాల అధిపతులు, జర్నలిజం అధ్యాపకులు డాక్టర్ షేక్ హసీనా, షమీర్, వెంకటేశ్వర్లు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.