తెలంగాణా రాష్ట్రం దేశ జిడిపిలో 5 శాతం ఆదాయాన్ని సమకూరుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు నిధులు విడుదల చేయడం లేదు. రాష్ట్రం నుంచి పన్ను వసూళ్ల రూపంలో రూ.60 వేల కోట్ల ఆదాయాన్ని కేంద్రం పొందుతోంది. అయినా వివక్ష చూపడం అన్యాయమని ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తం చేసారు. మంగళవారం నాడు శాసనసభ ప్రశ్రోత్తరాల సమయంలో ఆయన సిఎం రేవంత్ రెడ్డికి బదులుగా మున్సిపల్ శాఖకు సంబంధించి బీఆరెస్, బిజెపి సభ్యుల ప్రశ్నలకు జవాబులిచ్చారు. జంటనగరాలు, రంగారెడ్డి జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్లు, రోడ్ ఓవర్ బ్రిడ్జిల పనులను వేటినీ రద్దు చేయలేదని శ్రీధర్ బాబు స్పష్టం చేసారు. కొన్ని చోట్ల స్వల్ప మార్పులు చేసినా పనులన్నీ వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని తెలిపారు. వీటన్నటిని రూ.2,250 కోట్లతో పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. బిఆరెస్ హయాంలో కొన్ని పనులు మొదలై అసంపూర్తిగా మిగిలిన పనులను పూర్తి చేసిన విషయాన్ని ఆయన జ్ణాపకం చేసారు. ప్రాధాన్యత క్రమంలో అన్నిటిని పూర్తి చేస్తామని వివరించారు. కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద పనులు 15 రోజుల్లో ప్రారంభమవుతాయి. బాచుపల్లి హెచ్ ఎండిఏ ఫ్లైఓవర్ పనులు మేనెల లోగా పూర్తి చేసి ప్రారంభించాలని ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నారు. తప్పకుండా పూర్తి చేసి ట్రాఫిక్ ఇబ్బందులను తొలగిస్తాం. లింక్ రోడ్లలో మార్పులు ఏమీ లేవు. కొన్ని పనులను రద్దు చేసామని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. తప్పుడు ప్రచారాలు చేయవద్దని బీఆరెఎస్ ఎమ్మెల్యేలకు హితవు పలికారు. మేడ్చల్- సుచిత్ర ఎలివేటెడ్ రోడ్డు పనుల కాంట్రాక్టర్ మధ్యలో వదిలేసి వెళ్లాడు. దీనిపై సిఎం, రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నిధిన్ గడ్కరీని కలిసి త్వరగా పూర్తి చేసేందుకు సహకరించాని కోరారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని కూడా వేగంగా పూర్తి చేస్తాం. అక్కడ కొత్త కాంట్రాక్టర్ వచ్చారు. ప్యారడైజ్- శామీర్ పేట, ప్యారడైజ్- సుచిత్ర ప్రాజెక్టు పనులు కూడా టెండర్ల ప్రక్రియలో ఉన్నాయి. డిఫెన్సు భూముల బదలాయింపుకు సంబంధించిన సమస్యలపై సిఎం రేవంత్ రెడ్డి నాలుగు సార్లు కేంద్ర రక్షణ మంత్రిని కలిసి పరిష్కారానికి కృషి చేసారు. త్వరలో పనులు మొదలవుతాయి. హస్తినాపురం ఫ్లైఓవర్ ప్రతిపాదనపై మరిన్ని అధ్యయనాలు జరగాల్సి ఉంది. తప్పకుండా చేపడతాం. మూసి ప్రక్షాళన కార్యక్రమంతో పాటు తూర్పు- పడమర ప్రాంతాలను కలిపేలా భారీ రహదారులను చేపట్టే ప్రణాళికలు సిద్ధమయ్యాయని శ్రీధర్ బాబు వెల్లడించారు. జంటనగరాలకు జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వలసలు పెరుగుతున్నాయి. దానికి తగినట్టు మంచినీటి సరఫరా, రహదారులను విస్తరించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో భారీ ఆకాశ హర్మ్యాలకు గత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అవన్నీ పూర్తయే దశకు చేరుకున్నాయి. అక్కడ ఆవాసాలు మొదలైతే పీక్ అవర్లో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుంది. దీని పరిష్కారానికి తమ ప్రభుత్వం పలు పనులను చేపడుతోందని వివరించారు. మూసీ ప్రాజెక్టులో భాగంగా మురుగనీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణాలు పూర్తవుతున్నాయి. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. గతంలో మూసీ నదీ గర్భంలో ఎస్టీపీని ఏర్పాటు చేయడానికి శాంక్షన్లు ఇచ్చారు. సాంకేతికంగా ఇది పెద్ద పొరపాటు. దానిని మరో చోట ఏర్పటు చేస్తున్నాం. శుద్ది చేసిన జలాలను పారిశ్రామిక అవసరాలకు వినియోగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అని శ్రీధర్ బాబు తెలిపారు.
ఏపితో సమానంగా నిధులు ఇప్పించాలి…
అమృత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్ కు భారీగా నిధులు విడుదల అవడం సంతోషకరం. అదే స్థాయిలో నిధులను తీసుకురావాలని బిజెపి ఎంపీలను కోరుతున్నాం. ఇద్దరు కేంద్ర మంత్రులున్నా తెలంగాణాకు చిన్న చూపు ఎదురవుతోందని శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తం చేసారు. చిన్న రాష్ట్రమయినా ఐదు శాతం జిడిపికి తోడ్పతున్న విషయాన్ని విస్మరించరాదని అన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.