నాకు మంత్రి పదవి ఇస్తే పార్టీ, ప్రభుత్వానికే మంచిది
మీడియాతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నేను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాను
ఏ పదవి లేకపోయినా ప్రజల్లో ఆదరణ, గౌరవం ఉంది
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తాను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ పదవి లేకపోయినా ప్రజల్లో తనకు ఎనలేని ఆదరణ, గౌరవం ఉందన్నారు, తనకు మంత్రి పదవి ఇస్తే అది వ్యక్తిగతంగా తనకంటే కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వానికే మంచి పేరు తెస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రి పదవి విషయంలో గతంలో అధిష్టానం తనకు హామీ ఇచ్చిందన్న ఆయన అధిష్టానం ఇప్పుడు ఏం చేస్తుందో తనకు తెలియదన్నారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే తనలాంటి తెలంగాణ ఉద్యమకారుల సేవలు పార్టీకి చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. కేడర్‌లో పట్టున్న నేతలను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పరోక్షంగా గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని రాజగోపాల్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఈ నెల 23న ముఖ్యమంత్రితో ప్రత్యేక భేటీ ఏదీ జరగలేదన్న ఆయన అసెంబ్లీలో ఎదురుపడినప్పుడు కేవలం మర్యాదపూర్వకంగా పలకరించుకున్నామని తెలిపారు. మంగళవారం అసెంబ్లీ డైనింగ్ హాల్‌లో కేటీఆర్‌తో జరిపిన సుదీర్ఘ భేటీపై స్పందించిన ఆయన అది కేవలం సాధారణ సంభాషణ మాత్రమేనని చెప్పారు. అయితే, ఆ చర్చల్లో గత రాజకీయ పరిణామాలను ప్రస్తావించినట్లు ఆయన వెల్లడించారు. “2018 ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 88 సీట్లు వచ్చినప్పటికీ, 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం మీరు చేసిన అతిపెద్ద తప్పు అని కేటీఆర్‌కు చెప్పాను,” అని రాజగోపాల్ రెడ్డి వివరించారు. అంతకు ముందు అసెంబ్లీ డైనింగ్ హాల్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఒకే టేబుల్‌పై కూర్చుని లంచ్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా ప్రజాప్రతినిధులు డైనింగ్ హాల్‌లో కలిసి భోజనం చేయడం సహజమే అయినప్పటికీ, ఈ ముగ్గురు నేతల భేటీ మాత్రం ప్రత్యేకత సంతరించుకుంది. భోజనం పూర్తయిన తర్వాత కూడా వారు అక్కడే ఉండి దాదాపు రెండు గంటల పాటు ఏకాంతంగా చర్చలు జరపడం ఆసక్తి రేకెత్తించింది.