ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తి చేసినా డబ్బులు ఎపుడు అందుతాయో తెలియదన్నది జగమెరిగిన సత్యం. ఇదే క్రమంలో తాము చేసిన కులగణన సర్వే ఎంట్రీ డబ్బుల మాటేమిటని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. గతంలో ప్రభుత్వం కులగణన సర్వేను నిర్వహించింది. ఈ సర్వే అనంతరం వివరాలను డిజిటలైజ్ చేసే కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఇవ్వాలని నిర్ణయించారు. డేటా ఎంట్రీ కోసం విద్యార్థులకు పారితోషికం ఇచ్చేందుకు అంగీకరించారు. తాము చదువుకునే సమయంలోనే డబ్బులు సంపాదించుకోవచ్చని ఆనందించారు. ట్రిపుల్ ఐటీ లో చదువుతున్న దాదాపు 1600 మంది విద్యార్థులు 1.90 లక్షల ప్రతుల డేటా ఎంట్రీ చేశారు. ఒక్కో ప్రతి ఎంట్రీ చేసినందుకు గాను రూ.30 చొప్పున ఇస్తామని ప్రకటించారు. నమోదు ప్రక్రియ పూర్తై ఏడాది కావస్తున్నా ఇప్పటికీ డబ్బుల ఊసే లేదు. ఇందుకు సంబంధించి ఎవరూ నోరు మెదపకపోవటంతో తాము రోజుల తరబడి శ్రమించి చేసిన పనికి ప్రతిఫలం ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు.