జూపల్లి బస్టాండ్ నుంచి ఆసుపత్రికి గర్భిణులు, బాలింతలకు ఉచిత ప్రయాణ సౌకర్యం
ముద్ర ప్రతినిధి కొల్లాపూర్:
కొల్లాపూర్ పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రికి వచ్చే గర్భిణులు, బాలింతల రవాణా కష్టాలు ఇక తీరనున్నాయి. వారి సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఉచిత ఎలక్ట్రిక్ బ్యాటరీ వాహనాన్ని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ప్రారంభించారు.
పట్టణంలోని బస్టాండ్ నుంచి రామాపురం శివారులో ఉన్న మాతా శిశు సంరక్షణ ఆసుపత్రికి వెళ్లేందుకు రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక చొరవ తీసుకుని ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
హైదరాబాద్‌కు చెందిన ‘గుడ్ యూనివర్స్’ సామాజిక సేవా సంస్థ, ‘ఆర్సేసియం’ సంస్థల సహకారంతో ఈ పర్యావరణహిత వాహనాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులకు ఈ ఉచిత రవాణా సౌకర్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. సురక్షితమైన, సులభతరమైన ప్రయాణాన్ని అందించేందుకు ముందుకు వచ్చిన సేవా సంస్థలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు అనుష్క, వంశీ, ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.