Take a fresh look at your lifestyle.

ఆధారాలు లేకున్నా ఆగని వేటగా … మహానగరాన్ని జల్లెడ పట్టి మైనర్ బాలికను కాపాడిన గద్వాల్ పోలీస్ విజయగాథ

 

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి:

పోలీసింగ్ అంటే కేవలం టెక్నాలజీ కాదు… అది నిబద్ధత, పట్టుదల, బాధ్యత. ఈ సత్యాన్ని మరోసారి ఘనంగా గద్వాల్ పోలీసులు నిరూపించారు.‌ ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా, గద్వాల పట్టణంలో మాయమైన మైనర్ బాలికను మహానగరమైన హైదరాబాద్‌లో క్షేమంగా గుర్తించి రక్షించడం జరిగింది.

ఈనెల‌9వ తేదిన గద్వాల్ పట్టణంలో ఇంటిలో తల్లి మాటలకు అలిగిన కూతురు (ఒక మైనర్ బాలిక) ఇంటిని వదిలి వెళ్లిపోవడం, తల్లిదండ్రులు ఆవేదనతో పోలీసులను ఆశ్రయించడం — ఇదే ఈ కేసుకు ప్రారంభం. కానీ అక్కడినుంచి ఇది ఒక సాధారణ మిస్సింగ్ కేసుగా కాకుండా, “మిషన్ రెస్క్యూ”గా మారింది. జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు దిశానిర్దేశంతో వెంటనే స్పెషల్ టీం రంగంలోకి దిగింది.

సీఐ టంగుటూరి శ్రీను నాయకత్వంలో ఎస్సై కళ్యాణ్ కుమార్, పి.సి.లు చంద్రయ్య, కిరణ్ కుమార్, రామకృష్ణ ల బృందం ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా ఆచూకీ కోసం పరిగెత్తింది. మొదట ఎలాంటి ఆధారాలు లేకపోయినా, గద్వాల్ బస్సు డ్రైవర్ చెప్పిన చిన్న లీడ్‌ను కూడా పెద్ద క్లూగా మలచడం — అదే నిజమైన పోలీసింగ్. అక్కడి నుంచి మహానగరం హైదరాబాద్‌లో మొదలైన ఆపరేషన్ ఒక యుద్ధంలా మారింది. మొబైల్ ట్రేస్ లేదు… డిజిటల్ ఆధారాలు లేవు… ఎక్కడ ఉందో తెలియదు… అయినా వెనక్కి తగ్గని పోలీస్ బృందం ప్రతి వీధిని, ప్రతి బస్టాండ్‌ను, ప్రతి మూలను వెతికింది. నిద్ర లేకుండా, విశ్రాంతి లేకుండా, “బాలికను సురక్షితంగా కనుగొనాలి”.అనే లక్ష్యంతో గద్వాల పోలీస్ టీం పని చేసింది.

హైదరాబాద్లో లోకల్ పోలీసుల సహకారంతో వందలాది సీసీ కెమెరాలను గంటల తరబడి పరిశీలిస్తూ, చిన్న చిన్న కదలికలను కూడా వదలకుండా విశ్లేషిస్తూ చివరకు గమ్యం చేరుకున్నారు. ఆచూకీ లేని ఆ బాలిక అఫ్జల్ గంజ్ బస్టాండ్ పరిసరాల్లో కనిపించగానే, పోలీస్ బృందం మెరుపువేగంతో స్పందించి అక్కడికి చేరుకుని బాలికను క్షేమంగా అదుపులోకి తీసుకుంది. ఈ విజయానికి కారణం టెక్నాలజీ కాదు… పోలీసుల అచంచల సంకల్పం.

జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్పెషల్ టీంను అభినందిస్తూ, వారి కృషి పోలీస్ శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు. మహానగరంలో కూడా తమ ప్రజలను కాపాడే శక్తి తమకు ఉందని వారు ఘనంగా నిరూపించారు. ఈ ఘటనతో గద్వాల్ పోలీసులపై ప్రజల నమ్మకం మరింత బలపడింది అని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.