ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు వేచి ఉండే పరిస్థితి ఉండకుండా కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన నిర్వహించాలని, ఇప్పటికే జిల్లాలో 70 శాతం కొనుగోలు పూర్తయిందని, మిగిలిన మక్కలను వచ్చే మూడు రోజులలో కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. కొనుగోలు కేంద్రానికి మొక్కజొన్న భారీగా రావడంతో మార్కెట్ యార్డ్ పరిసరాల్లో ఉంచిన ధాన్యాన్ని కలెక్టర్ తిరిగి పరిశీలించారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోకుండా షెడ్లలో కాకుండా షెడ్లు సరిపోక బహిరంగ ప్రదేశంలో ఉంచిన మొక్కజొన్నను ముందుగా తూకం చేయాలని ఆదేశించారు. లారీల కొరతను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ గోదాములు సరిపోనందున ప్రైవేటు గోదాముల్లోనూ మొక్కజొన్నను నిలువ ఉంచాలని సూచించారు. ప్రస్తుతం హమాలీల కొరత పరిష్కారమైనందున ఇబ్బంది లేదన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ పంట కొనుగోలుకు సంబంధించి రైతుల ధ్రువీకరణ పత్రాలను, వివిధ రిజిస్టర్లను పరిశీలించారు. పలువురు రైతులతో మాట్లాడారు.
అనంతరం జిల్లాలోని ఎనిమిది మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు ప్రక్రియపై జిల్లా కలెక్టర్ తన ఛాంబర్ లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ నర్సింగరావు, మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, మార్క్ఫెడ్ డిఎం చంద్రమౌళి, డీఏవో వీరప్ప, డిపిఓ శ్రీకాంత్, పౌరసరఫరాల శాఖ మేనేజర్ విమల, గద్వాల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీకాంత్, గద్వాల మండల వ్యవసాయాధికారి ప్రతాప్ కుమార్, తహసిల్దార్ హరికృష్ణ, పిఎసిఎస్ ఇన్చార్జి సీఈవో రాజు, తదితరులున్నారు.