భక్తుల భద్రతకు 40 మొబైల్ అంబులెన్స్‌ల ఏర్పాటు
మీడియా సెంటర్, మేడారం, జనవరి 28 : శ్రీ సమ్మక్క–సారలమ్మ మేడారం మహాజాతర సందర్భంగా భక్తులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు జిల్లా యంత్రాంగం ఫస్ట్ రెస్పాండర్ 108 బైక్ అంబులెన్స్ సేవలను విస్తృతంగా ఏర్పాటు చేసింది.
మేడారం జాతర ప్రాంతమంతటా మొత్తం 40 ఫస్ట్ రెస్పాండర్ 108 బైక్ అంబులెన్స్‌లను వివిధ కీలక ప్రాంతాల్లో మోహరించారు. భారీ రద్దీ ఉన్న ప్రాంతాల్లోనూ వేగంగా చేరుకుని వైద్య సహాయం అందించేందుకు వీలుగా ఈ బైక్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మొబైల్ 108 సేవల ద్వారా జ్వరం, తలనొప్పి, వాంతులు, అలసట వంటి స్వల్ప ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న భక్తులకు తక్షణ ఫస్ట్ ఎయిడ్‌తో పాటు అవసరమైన ప్రాథమిక మందులు అందిస్తున్నారు.అలాగే, పరిస్థితి విషమంగా ఉన్న సందర్భాల్లో భక్తులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలిపారు. జాతర కాలమంతా ఈ సేవలు నిరంతరంగా అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. భక్తుల భద్రత, ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పగడ్బందీ చర్యలు చేపట్టింది.