Take a fresh look at your lifestyle.

‘మెట్రో’లో ముందడుగు

  • హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులకు అనుమతి.
  • ప్రాజెక్టుకు రూ.19,579 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ మెట్రో రెండో దశ (బి) ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, మేడ్చల్, శామీర్‌పేట ప్రాంతాలకు మొత్తం 86.1 కిలోమీటర్ల మేర కొత్త మార్గాలు నిర్మించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఇలంబర్తి ఈ ప్రాజెక్టుకు రూ.19,579 కోట్లు మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక పాతబస్తీ మెట్రో అనుసంధాన ప్రాజెక్టుకు రూ.125 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. రెండో దశ (బి)లో మొత్తం 86.1 కిలోమీటర్ల మేర మూడు కొత్త కారిడార్లను నిర్మించనున్నారు. కారిడార్ 9లో శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్‌సిటీ (స్కిల్స్ యూనివర్సిటీ) వరకు 39.6 కిలోమీటర్లు, కారిడార్ 10లో జేబీఎస్ (జూబ్లీ బస్ స్టేషన్) నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్లు, కారిడార్ 11లో జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకు 22 కిలోమీటర్లు నిర్మించనున్నారు. ఈ మూడు కారిడార్లు నగర శివారు ప్రాంతాలకు మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఈ ప్రాజెక్టును హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త వెంచర్‌గా చేపట్టనున్నాయి. తెలంగాణ ప్రభుత్వ వాటా 30 శాతం కాగా.. కేంద్ర ప్రభుత్వ వాటా 18 శాతంగా ఉండనుంది. జైకా, ఏడీబీ, ఎన్డీబీ నుంచి 48 శాతం రుణం తీసుకోనున్నారు. పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) కాంపోనెంట్ 4 శాతంగా ఉంటుంది.త్వరలోనే ఈ పరిపాలనా అనుమతిని డీపీఆర్‌కు జత చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు.

Leave A Reply

Your email address will not be published.