- అప్పుడు అందుకే ఓడిపోయాం.
- 2018లో మా ఓటమికి ఫోన్ ట్యాపింగే కారణం.
- ఇది హేయమైన చర్య అని ముందు నుంచీ చెప్తున్నాం.
- కాంగ్రెస్ నేతల ఫోన్లన్నీ ట్యాప్ చేశారు.
- నక్సల్స్కోసం అబద్దాలు చెప్తున్నారు.
- ఫోన్ ట్యాపింగ్ విచారణలో టీపీసీసీ చీఫ్ మహేశ్.
- రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయలేదంటున్న రిటైర్డ్ ఐజీ.
- నక్సల్స్ కోసమే ఫోన్లు ట్యాప్ చేశామంటూ సిట్‌ముందు వివరణ.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కారణంగానే తాము 2018 ఎన్నికల్లో ఓడిపోయామని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వెల్లడించారు. అప్పుడు ఈ విషయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద మంగళవారం వాంగ్మూలం ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆయన కూడా ఫిర్యాదు చేయడంతో.. ఆయన వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇచ్చిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో తమ ఫోన్‌ట్యాప్ చేశారనే అనుమానంతోనే సీఎస్‌కు ఫిర్యాదు చేసినట్లు టీపీసీసీ చీఫ్తెలిపారు. టెలిగ్రాఫ్ చట్టానికి తూట్లు పొడుస్తూ తమ ఫోన్లు ట్యాప్ చేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో రాజకీయనాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన కేసీఆర్, కేటీఆర్ సిగ్గుతో తలవంచుకోవాలన్నారు. రాజకీయాల్లో బీఆర్ఎస్ నేతలే ఉండాలనే దురుద్దేశంతో తమ ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పారు. రేవంత్ రెడ్డితో పాటు తన ఫోన్‌కూడా ట్యాప్ చేశారని, దీనిపై గతంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలా తమ కదలికలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారన్నారు. కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేయడం దుర్మార్గపు చర్యన్న ఆయన సుమారు 650 మంది సీనియర్ కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేశారని ఈ విషయం సిట్ విచారణలో తేలిందన్నారు. ప్రభుత్వాధికారులు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి తలొగ్గారని, దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా రిటైరైన వ్యక్తిని ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పెట్టారని, రిటైరైన ప్రభాకర్‌రావును గత ప్రభుత్వం ఐజీ చీఫ్‌గా నియమించిందన్నారు. కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేసి బీఆర్‌ఎస్ రాజకీయ లబ్ధి పొందిందని, ఇంకోసారి ఇలాంటివి జరగకుండా అధికారులు, నేతలకు శిక్ష పడాలని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఎంతటివారున్నా శిక్షపడాల్సిందేనని, ఈ కేసులో నిందితులను సుప్రీంకోర్టు తీవ్రంగా శిక్షించాల్సిందేనని, రాజకీయ నేతలు, జడ్జిలు, అధికారుల ఫోన్లనూ ట్యాప్ చేశారన్నారు. ఫోన్‌ట్యాపింగ్ వల్లే కాంగ్రెస్ కొన్నిస్థానాల్లో ఓడిపోయిందని, నక్సల్స్‌తో సంబంధం ఉందనే అసత్య ఆరోపణలతో తమ ఫోన్లు ట్యాప్ చేశారని, బీఆర్‌ఎస్ ఓడిపోతుందని తెలిసే హర్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేశారని మహేశ్ కుమార్ గౌడ్చెప్పారు.
- అందుకే అప్పుడో ఓడాం.
రాజకీయాల్లో బీఆర్ఎస్ నేతలే శాశ్వతంగా ఉండాలనే చెడు ఆలోచనతో ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని టీపీసీసీ చీఫ్ అన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణం ఫోన్ ట్యాపింగ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంభం అనిల్ కుమార్ యాదవ్, గాలి అనిల్ తోపాటు అనేకమంది ఫోన్లు ట్యాప్ అయినట్లు విషయం బయటికోస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు నాడు ఏరకంగా అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో అర్థం అవుతుందన్నారు.ప్రజాస్వామ్యంలో నిక్కచ్చిగా పనిచేయాల్సిన అధికారులు, ఏ రకంగా రాజకీయ నాయకులకు తలొగ్గి అడుగులకు మడుగులొత్తారు అని ప్రశ్నించారు.
- నక్సల్స్ కోసమే చేశాం: ప్రభాకర్‌రావు
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం వెయ్యి మంది నేతల ఫోన్టు ట్యాప్ చేసినట్లు ఈ విచారణలో గుర్తించారు. తెలంగాణలో 650 మంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు కనుగోన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలపై ప్రధానంగా ఫోకస్ చేసి.. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అక్రమంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్లు సిట్ విచారణలో వెలుగులోకి వచ్చింది. ఆమె ఎవరెవరితో మాట్లాడుతున్నారు. అందుకు సంబంధించిన ప్రతి అంశం నాటి ఏపీ సీఎం, ఆమె సోదరుడు వైఎస్ జగన్‌కు చేరవేసినట్లు సమాచారం. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో మంగళవారం మరోసారి ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు సిట్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే 600 మంది ఫోన్ ట్యాపింగ్ జాబితాను అధికారులు సిద్ధం చేశారు. వారందరూ వాంగ్మూలం ఇవ్వాలని పోలీసులు సూచించారు. ఈ సిట్ అధికారుల విచారణలో తొలుత ఆయన ప్రశ్నలను దాట వేసినట్లు సమాచారం. అనంతరం వరుసగా జరిగిన విచారణలో ఆయన నుంచి సిట్ అధికారులు కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. సాధారణ ఎన్నికల సమయంలో నవంబర్ 15న పెద్ద ఎత్తున ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నవంబర్ 15న 600 మంది ఫోన్లను ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసింది. సాధారణ ఎన్నికల సమయంలో ప్రణీత అండ్ టీమ్ పెద్ద ఎత్తున ట్యాపింగ్‌కు పాల్పడినట్లు బయటపడింది. ఒకే రోజు 600 ఫోన్‌లను ప్రభాకర్ రావు ట్యాప్ చేశారు.మావోయిస్టుల పేరు చెప్పి ట్యాపింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.మావోయిస్టులకు సహకారం అందిస్తున్నారని మావోయిస్టుల సానుభూతిపరుల పేర్లతో ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. రివ్యూ కమిటీకి మావోయిస్టుల పేర్ల మీద నెంబర్లను ప్రభాకర్ రావు ఇచ్చారు. సాధారణ ఎన్నికల్లో మావోయిస్టులు యాక్టివ్ అయ్యారని కమిటీకి ప్రభాకర్ రావు చెప్పినట్లు సమాచారం. మావోయిస్టుల పేరుతో అధికార, ప్రతిపక్ష, వ్యాపార రంగానికి చెందిన వారితో పాటు జర్నలిస్టుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు.ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు భుజంగరావుకు ప్రణీత్ ఇచ్చారని.. భుజంగరావు నేరుగా బీఆర్ఎస్ నేతలకు ఫోన్ చేసి స్థితిగతులను ఎప్పటికప్పుడు వివరించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతిపక్ష నాయకుల వైపు ఎవరైనా వెళ్తుంటే వెంటనే అధికారపక్ష నేతలకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు భుజంగరావు. ప్రతిపక్ష పార్టీలకు ఆర్థిక సాయం చేస్తున్న వారిపై నిఘా పెట్టి పోలీసులతో దాడులు చేయించారు. వ్యాపారవేత్తలపై దాడుల కోసం టాస్క్ ఫోర్స్ ఓఎస్‌డీ రాధా కిషన్ రావును ప్రభాకర్ రావు ఉపయోగించుకున్నట్లు సమాచారం. డబ్బులు ఎవరైనా తీసుకువెళ్తుంటే వెంటనే ట్యాప్ చేసి మరీ అధికారులు పట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు.