ముద్ర, కరీంనగర్ :
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి , రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరం కృషి చేద్దామని చొప్పదండి ఎమ్మెల్యే, జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ మేడిపల్లి సత్యం పేర్కొన్నారు.
మంగళవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే సహా కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, సుడా చైర్మన్ కోమటీ రెడ్డి నరేందర్ రెడ్డి, ఉన్నత అధికారులు, వివిధ సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడారు. అంబేద్కర్ చిన్నతనం నుంచి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని.. ఖండాలు సముద్రాలు దాటి ఉన్నత విద్య అభ్యసించారని పేర్కొన్నారు. ప్రపంచంలోనే మేధావిగా పేరుగాంచారన్నారు.
సుమారు 30 డిగ్రీలు పూర్తి చేసిన అంబేద్కర్.. నా సేవలు నా దేశానికే ఉపయోగపడాలనే ఉద్దేశంతో భారతదేశానికి వచ్చి సేవలందించారన్నారు.
విదేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి.. అన్ని వర్గాలకు మేలు చేసేలా భారతదేశ రాజ్యాంగం రూపొందించడంలో కీలకపాత్ర పోషించారని వివరించారు.
రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ ద్వారానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని గుర్తు చేశారు. పిల్లలను కూడా అంబేద్కర్ మాదిరి ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు.

అంబేద్కర్ ఆశయాలతో ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు పెద్దపీట వేస్తూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత ప్రభుత్వానికి సాధ్యం కానీ ఎస్సీ వర్గీకరణ చేసిందన్నారు. కేబినెట్లో నలుగురు దళిత మంత్రులు ఉన్నారని.. స్పీకర్, డిప్యూటీ సీఎం గా దళితులే ఉన్నారని.. కరీంనగర్ జిల్లాలో ముగ్గురం దళిత ఎమ్మెల్యేల ఉన్నామని.. మమ్మల్ని సంప్రదిస్తే అండగా ఉంటామని పేర్కొన్నారు.

కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ
అంబేద్కర్ ఆలోచనలు,ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
వ్యక్తిగత ఎదుగుదల కంటే సామాజిక ప్రయోజనాలే గొప్ప అని చాటిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు.
మనం అనుభవిస్తున్న రాజ్యాంగ ఫలాలకు అంబేద్కర్ కృషే కారణమన్నారు.
ప్రజలు , సంఘాల నాయకులు ఎలాంటి సమస్యలున్న తమ దృష్టికి తీసుకురావాలని.. క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
అంబేద్కర్ జీవిత చరిత్ర చదవాలని యువతకు సూచించారు.
సిపి గౌస్ ఆలం మాట్లాడుతూ
అంబేద్కర్ చెప్పిన మాటలు educate – organize నిరంతరం గుర్తుంచుకోవాలన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే మనం ఈ స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు. తాను ప్రభుత్వ విద్యాసంస్థల్లో, స్కాలర్షిప్ తో చదివి ఈ స్థాయికి చేరినట్లు సీపీ గుర్తు చేసుకున్నారు.
జ్ఞానం , చదువే అన్ని సమస్యలకు పరిష్కారమని బలంగా నమ్మిన అంబేద్కర్ ఆ రోజుల్లోనే లండన్ వెళ్లి ఉన్నత చదువులు చదివారని వివరించారు. ఆయన చదివిన చదువుకు ఎంతో సంపాదించే వారని.. కానీ దేశం కోసం తన జీవితం త్యాగం చేసిన మహనీయుడని పేర్కొన్నారు.
సుమారు 50 వేల పుస్తకాలు ఉన్న అతని ఇంటిని దేశంలోనే పెద్ద ప్రైవేట్ లైబ్రరీగా చెప్పుకుంటారని అన్నారు. కేంద్ర న్యాయ, కార్మిక మంత్రిగా దేశానికి సేవలందించారని పేర్కొన్నారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ
అంబేద్కర్ స్ఫూర్తితో మనం ఎడ్యుకేషన్ పై దృష్టి సారించాలని పేర్కొన్నారు. బలహీన వర్గాల అభివృద్ధికి, సామాజిక సమస్యల పరిష్కారానికి చదువే మూలమని అన్నారు.
అంబేద్కర్ మాటలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలని సూచించారు.
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అంబేద్కర్ అందరివాడని.. ఆయన ఆలోచనలను మనం ఆచరించి చూపాలని పిలుపునిచ్చారు.
ఆనవాయితీ ప్రకారం భీమ్ యాత్రను ప్రారంభించారు. ఎమ్మెల్యేను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో , మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, rdo మహేశ్వర్ మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, వివిధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.