ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లావ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇసుక అక్రమ రవాణా చేసే వారి భరతం పడతామని జిల్లా పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది. గత వారం రోజులుగా నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా, అక్రమ నిల్వలను పూర్తిగా అరికట్టేందుకు అత్యంత కఠిన చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతర తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా గత వారం రోజులుగా జిల్లాలోని సారంగపూర్, లోకేశ్వరం, బాసర, భైంసా,భైంసా రూరల్, లక్ష్మణచందా మండలాల పరిధిలో ప్రత్యేక బృందాలతో విస్తృతంగా దాడులను నిర్వహించి అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడుతున్న ట్రాక్టర్లు, టిప్పర్లు, ఇతర వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకుంటున్నారు. భైంసా పట్టణ ప్రాంతంలో అక్రమ ఇసుకపై భైంసా ఇన్స్పెక్టర్ భైంసా తహసీల్దారు సహకారంతో అక్రమంగా తరలిస్తున్న వాహనాలను సీజ్ చేశారు. సారంగాపూర్ మండల పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 30 ట్రాక్టర్ల ఇసుక డంప్ తో పాటు జె సి బి సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. భైంసా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణ పై 2 కేసులు, లోకేశ్వరం పరిధిలో 13 ట్రాక్టర్ల అక్రమ ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. బాసర మండల పరిధిలో 2 కేసులు నమోదు చేసి, 50 టన్నుల ఇసుక, అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 టిప్పర్ వాహనాలను, 2 మొబైల్ ఫోన్లను జప్తు చేశారు. ఇసుక స్మగ్లింగ్ నేరస్థులపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ జిల్లాలో ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలించినా, నిల్వ ఉంచినా, సంబంధిత నిబంధనలను ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జానకి షర్మిల స్పష్టం చేశారు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు అమలు చేస్తామని ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు.