Take a fresh look at your lifestyle.

శాతవాహన యూనివర్సిటీలో దళిత ప్రొఫెసర్, విద్యార్థిపై వేధింపులు ఆపాలి: విద్యా పరిరక్షణ కమిటీ

 

ముద్ర, కరీంనగర్:

శాతవాహన యూనివర్సిటీలో దళిత ప్రొఫెసర్ మరియు విద్యార్థిపై జరుగుతున్న వేధింపులను తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కె. చక్రధరరావు, కార్యదర్శి ప్రొఫెసర్ జి. హరగోపాల్, కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణలు ఈ మేరకు ఆందోళన వ్యక్తం చేశారు.

గత కొన్ని వారాలుగా యూనివర్సిటీలో సోషియాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, అలాగే ఎకనామిక్స్ విభాగానికి చెందిన విద్యార్థి కరికే మహేష్‌లను ఎలాంటి ఆధారాలు లేకుండా “అర్బన్ నక్సలైట్లు”గా చిత్రీకరిస్తూ కొందరు విద్యార్థులు ఫిర్యాదులు చేస్తున్నారని వారు తెలిపారు. కలెక్టర్, పార్లమెంట్ సభ్యులకు కూడా ఫిర్యాదులు పంపిస్తూ వివిధ మాధ్యమాలలో అసత్య ప్రచారం జరుగుతోందని ఆరోపించారు.

అన్ని అర్హతలు, అనుభవం ఉన్నప్పటికీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న దళిత మహిళా ప్రొఫెసర్‌ను లక్ష్యంగా చేసుకోవడం కక్షపూరిత చర్యగా పేర్కొన్నారు. ఈ సంఘటనల వల్ల గ్రామీణ ప్రాంతాలు, దళిత, ఆదివాసీ వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులపై ప్రతికూల ప్రభావం పడుతూ, యూనివర్సిటీ అకాడమిక్ వాతావరణం దెబ్బతింటోందని తెలిపారు.

విశ్వవిద్యాలయ స్వయంప్రతిపత్తి, విద్యా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛలను కాపాడాల్సిన బాధ్యత వైస్ చాన్స్లర్‌పై ఉందని, కానీ ఆయన మౌనం పాటించడం సరికాదని విమర్శించారు. విద్యా వ్యాపారీకరణ, అతికేంద్రీకరణ, మత ఉన్మాదం పెరుగుతున్న ఈ సమయంలో అణగారిన వర్గాల నుంచి వచ్చిన మహిళా ప్రొఫెసర్‌పై వేధింపులు జరగడం తీవ్రంగా ఖండించాల్సిన అంశమని అన్నారు.

ఇప్పటికైనా నిరాధార ఆరోపణలు, వేధింపులు, కక్షపూరిత చర్యలను నిలిపివేసి యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి, అకాడమిక్ వాతావరణాన్ని కాపాడాలని వారు వైస్ చాన్స్లర్‌ను కోరారు.

Leave A Reply

Your email address will not be published.