కోరుట్ల, ముద్ర విలేకరి: స్థానిక పద్మశాలి భవనం లో లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల ఆధ్వర్యంలో మంగళ వారం రోజు ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 224 మంది వ్యక్తులు కంటి పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 54 మంది మోతె బిందు సమస్యతో బాధపడుతున్న వారిగా గుర్తించబడి, ఉచిత శస్త్ర చికిత్స కోసం రేకుర్తి కంటి ఆసుపత్రికి ఉచితంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్ ద్వారా తరలించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొమ్ముల జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరికి సుమారు 20 వేల రూపాయల విలువ చేసే ఐ ఓ ఎల్ సర్జరీలు పూర్తి ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆరోగ్య చైతన్యం పెంపొందించడం, అవసరమైన వైద్య సేవలను చేరవెయ్యడం లక్ష్యంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల నిరంతరంగా కృషి చేస్తోందని జీవన్ రెడ్డి తెలిపారు. శస్త్ర చికిత్స అనంతరం వీరిని తిరిగి కోరుట్లకు భద్రతగా తీసుకు వస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొమ్ముల జీవన్ రెడ్డి, కార్యదర్శి ఏలేటి లక్ష్మారెడ్డి, కోశాధికారి నల్ల గంగాధర్, డాక్టర్ కట్కం జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.