యైటింక్లయిన్ కాలని. ముద్ర: మహాకవి పోతన కాలనీ లోని సింగరేణి క్వార్టర్లలో మంగళవారం జరిగిన ప్రమాదంలో రాకేష్ అనే ఉద్యోగి గాయపడ్డాడు. బాధితుడు రాకేష్ భార్యా పిల్లలు తెలిపిన వివరాల ప్రకారం, ఏరియా పరిధిలోని వకీల్ పల్లి గనిలో ఓవర్మేన్ గా విధులు నిర్వహిస్తున్న రాకేష్ పోతన కాలనీ 65వ బ్లాక్ లోని 908 క్వార్టర్ లో భార్యా పిల్లలతో నివాసముంటున్నారు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి బదిలీకి వెళ్లివచ్చిన రాకేష్ మంగళవారం మధ్యాహ్నం నిద్రిస్తుండగా, రెండు గంటల సమయంలో ఆకస్మికంగా క్వార్టర్ బెడ్ రూం పైకప్పు నుండి పెచ్చులు ఊడి పైన పడటంతో రాకేష్ వెంటనే బెడ్ పైనుంచి లేచి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అయినప్పటికీ రాకేష్ స్వల్పంగా గాయపడ్డాడు. అదృష్టవశాత్తు రాకేష్ పిల్లలు ఇంట్లో లేకపోవడం వల్ల, ప్రాణనష్టం తప్పిందని, పిల్లలు స్కూల్ కు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే ప్రమాదానికి గురి అయ్యేవారని గాయపడిన రాకేష్, ఆయన భార్య, స్తానిక కుటుంబాలు భయాందోళన చెందారు. జరిగిన సంఘటన తెలిసిన హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహమ్మద్, సీఐటీయూ ఏరియా కార్యదర్శి కె. ప్రవీణ్ కుమార్ నాయకులు ఇక్కడికి చేరుకుని, సంఘటనా స్థలాన్ని పరిశీలించి, రాకేష్ భార్యా పిల్లలను, సమీప కుటుంబాలకు దైర్యం చెప్పారు. ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బ్లాక్ లో నివాసముంటున్న కార్మిక కుటుంబ సభ్యులు సింగరేణి యాజమాన్యం పట్ల అసంతృప్తిగా ఉన్నారని, కొన్ని నెలల నుండి సమస్యను సంబధిత అధికారుల దృష్టికి తీసుకెళుతున్నప్పటికీ ప్రయోజనం లేకుండాపోయిందని ఆరోపించారు. నాసిరకంతో చేపట్టిన నిర్మాణాల వల్లనే, ఈ లాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని వారు ఆరోపించారు. ఇప్పటికైనా జరిగిన ప్రమాదంపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని నాయకులు ఏరియా యాజమాన్యాన్ని కోరుతున్నారు.
