ముగిసిన వ(జ)న జాతర
జనంలో నుంచి వనంలోకి గిరిజన దేవతలు
అశేష భక్తజనం మధ్య అమ్మవార్ల వన ప్రవేశం
సమ్మక్క,సారలమ్మను దర్శించుకున్న సుమారు 2 లక్షల మంది
ముద్ర, మేడారం:
తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ముగిసింది. గత నెల 21న సాయంత్రం గిరిజన పూజారుల ప్రత్యేక పూజలతో సారలమ్మ రాకతో ప్రధాన జాతర మొదలైంది. గత నెల 28న మహాజాతర ప్రారంభమై…. శనివారం రాత్రి ముగిసింది. గత నెల 28న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి రాగా, 29న రాత్రి సమ్మక్క తల్లి గద్దెపై ప్రతిష్ఠితమయ్యారు. 30న రోజంతా నలుగురు దేవతలు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు వనాన్ని వీడి గద్దెలకు చేరారు. జాతర చివరి అంకంలో భాగంగా శనివారం రాత్రి అమ్మవార్లు వనప్రవేశం చేశారు. దీంతో నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సమాప్తమైంది. గద్దెల వద్ద నుంచి డోలు వాయిద్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనంలోకి తరలివెళ్లారు. అశేష భక్తజనం ఆ ఘట్టాన్ని తిలకించి పులకించిపోయారు. సమ్మక్క, సారలమ్మ నినాదాలతో అరణ్యం దద్దరిల్లింది. కాగా ఈ ఏడాది మేడారం జాతరకు సుమారు రెండు కోట్ల మంది భక్తులు హాజరై వనదేవతలను దర్శించుకున్నారు. తల్లులు గద్దెపైకి చేరడంతో ఎక్కువ మంది భక్తులు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం జాతర ముగిసినప్పటికీ భక్తులు తిరుగువారం వరకు మొక్కులు చెల్లించుకుంటారు. చివరి రోజైన శనివారం పలువురు రాజకీయ ప్రముఖులు వనదేవతలను దర్శించుకున్నారు. వనప్రవేశం పూర్తయినా భక్తుల రద్దీ కొనసాగుతుంది. నేడు రాత్రి వరకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారు. మరోవైపు 4వేల మంది పారిశుధ్య సిబ్బంది విధుల్లో ఉన్నారు.మేడారం జాతర విజయవంతం కావడానికి సహకరించిన భక్తులు, అధికారులు, సిబ్బంది, మీడియాకు మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. జాతర విజయవంతం అవడంపై గవర్నర్, సీఎం సంతోషం వ్యక్తం చేశారని వెల్లడించారు.