ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు ఒక వరం లాంటిదని… ఆత్మ గౌరవానికి ఇల్లు ప్రతీక అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇంటి పథకం ద్వారా పేదల సొంతింటి కల నెరవేరుతోందన్నారు.మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని హన్వాడ మండల పరిధి లోని ఎనిమిది తండా లో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ఆయన ప్రారంభించారు. ఇందిరమ్మ ఇంటి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదలకు భద్రమైన నివాసం కల్పించడం ప్రజా ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఇది సామాజిక సమానత్వానికి నాంది అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బీమిబాయి లింగమ్ నాయక్, ఉప సర్పంచ్ ఎన్ నరేష్, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి. మహేందర్, కార్యనిర్వహక అధ్యక్షులు చెన్నయ్య, కార్పోరేటర్లు ఎం. ప్రవీణ్ కుమార్, శేఖర్, యూత్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి,విజయ్ కుమార్, మండల తహశీల్దార్ కిష్య్టానాయక్ తదితరులు పాల్గొన్నారు.
………………………………
సేవాలాల్ దేవాలయ
అభివృద్ధికి కృషి :
………………………………..
సేవాలాల్ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే యెన్నం హామీ ఇచ్చారు.ఎనిమిది తండాలో మారెమ్మయాడి జాతర మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన సేవాలాల్ మహారాజ్ , మారెమ్మయాడి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయం అభివృద్ధి కోసం అవసరమైన నిధులు సమకూర్చి, క్షేత్రాన్ని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు.హన్వాడ మండలంలోనే కాకుండా ఉమ్మడి జిల్లా లోనే గొప్ప సేవాలాల్ ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. తండా లో అంతర్గత రహదారుల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. పరిసర తండాలలో నివసిస్తున్న విద్యార్థుల విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే గ్రామంలో ఉన్న సమస్యలు ఒక్కోక్కటిగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.