ఊరు, వాడల్లో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే రోహిత్
కల్యాణోత్సవంలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దంపతులు
ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు పూజలు
వేలాదిగా పాల్గొన్న భక్తులు
ముద్ర ప్రతినిధి, మెదక్:*
శ్రీరామ నవమి వేడుకలు మెదక్ జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. జిల్లా కేంద్రం మెదక్ తో పాటు డివిజన్ కేంద్రాలు నర్సాపూర్, తుప్రాన్, మండల కేంద్రాలు, గ్రామాల్లో సైతం రాములోరి కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
జిల్లా కేంద్రం మెదక్ శ్రీ కోదండ రామాలయంలో కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కమిటీ అధ్యక్షులు బండ నరేందర్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. అర్చకులు కల్యాణ క్రతువు జరిపారు. వేలాది మంది భక్తులు రామ నామ స్మరణ మారు మ్రోగించగా సీతా రాముల కల్యాణోత్సవం జరిగింది. అనంతరం ఒడి బియ్యం సమర్పించారు. అన్నప్రసాద వితరణ చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా టౌన్ సీఐ మహేష్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. శ్రీరాముడి అనుగ్రహంతో మెదక్ నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. వెంట మున్సిపల్ ఛైర్ పర్సన్ కానుగు రాధికా భూపతిరాజ్, వైస్ ఛైర్మన్ నరేష్ గౌడ్, మాజీ ఛైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు శివ రామకృష్ణ, హరిత, పట్టణ పార్టీ అధ్యక్షులు గంగాధర్, నాయకులు ముత్యంగౌడ్, మహేష్ తదితరులున్నారు.

మాజీ ఎమ్మెల్యే పద్మాదే వేందర్ రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజల్లో పాల్గొన్నారు. మెదక్ జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముని ఆశీస్సులు రాష్ట్రంపై ఉండాలని ఆకాంక్షిస్తూ, ఆయన గుణగణాలను అందరూ అలవర్చుకోవాలని సూచించారు. వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్, కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు, కౌన్సిలర్లు మాయ గంగామణి మల్లేశం, కొట్టాల లలిత విశ్వం, నాయకులు గడ్డమీద కృష్ణ గౌడ్, ఆర్కే శ్రీనివాస్, మాయ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ డి. వి. శ్రీనివాసరావు కోదండ రామాలయం సన్నిధిలో నిర్వహించిన కల్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు
నిర్వహించారు. తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీరామనవమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పగడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వెంట మెదక్ టౌన్ సీఐ మహేష్, ఎస్ఐ విట్టల్, పోలీసు సిబ్బంది ఉన్నారు.