- ఓపెన్ కాస్టుల్లో వర్షపు నీటిని తోడేందుకు అవసరమైన పంపులు సిద్ధం చేయండి.
- రోజుకు 2.15 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2.45 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరపాలి.
- భూగర్భ గనుల నష్టాల తగ్గింపుకు అధ్యయనం.
- ఓబీ కాంట్రాక్టర్లు లక్ష్యాల మేర పనిచేయాలి.
- సింగరేణి డైరెక్టర్లు, అన్ని ఏరియాలో జనరల్ మేనేజర్లతో సీఎండీ బలరామ్ సమీక్ష.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రానున్న వర్షాకాలంలో ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి ఏ మాత్రం కుంటుబడకుండా ఇప్పట్నుంచే చర్యలు ప్రారంభించాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లను ఆదేశించారు. వర్షపు నీటిని తోడి బయటకు పోయడానికి తగినన్ని పంపులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై మంగళవారం కొత్తగూడెం ప్రధాన కార్యాలయంలో ఆయన సింగరేణి డైరెక్టర్లు, అన్ని ఏరియాలో జనరల్ మేనేజర్లు, కార్పొరేట్ జనరల్ మేనేజర్లతో సమీక్ష నిర్వహించారు.సుదీర్ఘంగా సాగిన ఈ సమీక్షలో ఆయన ఏరియాల వారీగా ఉత్పత్తిని సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాదికి నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలంటే వర్షాకాలంలో కూడా నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణా సాధించాలని కోరారు. వార్షిక ఉత్పత్తి లక్ష్యాల సాధనకు రోజుకు కనీసం 2.15 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2.45 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరపాలని ఆదేశించారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదలకు ఏరియాల వారీగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా నాణ్యత ప్రమాణాలు బాగా పెంచాలని కోరారు. నాణ్యత లేని బొగ్గును వినియోగదారులు స్వీకరించడం లేదనీ అందుకే కింది స్థాయి నుంచి పై అధికారుల వరకు నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఉద్యోగులు యంత్రాలతో షిఫ్ట్ లో పూర్తి పని గంటలు పని చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండే వారిని అవసరమైతే తొలగించాలని ఆయన జీఎంలను ఆదేశించారు.గైర్హాజరు శాతాన్ని గణనీయంగా తగ్గించాలనీ ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు.ఓవర్ బర్డెన్ తొలగింపు పూర్తి అయితేనే బొగ్గు ఉత్పత్తి సజావుగా సాగుతుందన్న సీఎండీ ఓవర్ బర్డెన్ కాంట్రాక్టర్లతోనూ ఈ సందర్భంగా మాట్లాడారు. తగినన్ని యంత్రాలను పనిలో పెట్టి లక్ష్యాల మేర రోజువారీగా ఓవర్ బర్డెన్ తొలగించాలని సూచించారు. భూగర్భగనుల్లో నష్టాలను తగ్గించడం కోసం నిపుణుల బృందంతో త్వరలో పరిశీలన జరపనున్నట్లు తెలిపారు. శాంతిఖని, అడ్రియాల లాంగ్ వాల్ గనిలో ఈ బృందం ముందుగా పరిశీలన జరుపుతుందన్నారు. నాణ్యత పెంపుదల చర్యలో భాగంగా సత్తుపల్లి వద్ద ఒక కోల్ వాషెరీ ఏర్పాటుకు గల అవకాశాలను కూడా పరిశీలించాలని కోరారు. ఈ సమీక్షలో డైరెక్టర్ ఈ అండ్ ఎం డి.సత్యనారాయణ రావు, డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్.వి.సూర్యనారాయణ, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ మరియు పర్సనల్ కె.వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ ఎస్.డి.ఎం.సుభాని, జనరల్ మేనేజర్ సి.పి.పి. ఎ.మనోహర్, ఏరియాల జనరల్ మేనేజర్లు, కార్పొరేట్ జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.