హైదరాబాద్ కు తరలి వెళ్ళిన సీనియర్లు…
నామినేటెడ్ పదవులు తమకే దక్కాలని డిమాండ్…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
జగిత్యాలలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు 70మంది సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు మంగళవారం హైదరాబాద్ కు తరలి వెళ్లారు. ఇటీవలే మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అనుకోకుండా మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ రావడంతో సీనియర్లు వలసవాదులు అంటూ నాయకుల మధ్య ఆధిపత్య పోరు రగిలింది. దీనిపై మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ తో భేటీ అయ్యే తమకు న్యాయం చేయాలని కోరడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి గారితో కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఉన్న సమావేశం అనివార్య కారణాలతో వాయిదా పడగా, దీంతో మంగళవారం సాయంత్రం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి తో సమావేశం కానున్నారు. ఈ మేరకు రెండు బస్సుల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా కలిసి హైదరాబాదుకు పయనమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 5 గంటలకు అపాయింట్మెంట్ ఉండడంతో ఉదయమే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కజంగి నందయ్య ఆధ్వర్యంలో నాయకులంతా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కష్టనష్టాలకు ఓర్చుకొని పార్టీ జండా మోయడంతోపాటు పార్టీలో సీనియర్లం అయిన తమకు పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు అన్ని దక్కాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై సీఎంతో చర్చించనున్నామని పేర్కొన్నారు.