ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
…………………………………….
మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌గా నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ప్రభుత్వ విప్‌గా నియమితులైన యెన్నం శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అసెంబ్లీ లో ప్రభుత్వానికి సంబంధించిన శాసనసభ కార్యక్రమాలు సజావుగా కొనసాగేందుకు విప్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు.యెన్నం నియామకం పట్ల మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన నాయకుడికి ఇలాంటి కీలక పదవి దక్కడం గర్వకారణమని పేర్కొన్నారు.తమ రాజకీయ అనుభవం, ప్రజలతో ఉన్న అనుబంధం, సేవా దృక్పథంతో ఈ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన పదవీకాలంలో మహబూబ్‌నగర్ జిల్లాకు మరింత అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విప్‌గా ఆయన నియామకం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా అభివర్ణించారు. ఇప్పుడు ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు చేపట్టడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసేవకు మరింత అవకాశాలు లభించనున్నాయి. ఈ నియామకం నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయాయి. పలుచోట్ల నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లు పంచుకున్నారు.