ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి:
……………………………………..
పాలమూరు పట్టణంలో ప్రజల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణలో సమగ్ర మార్పులు తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ లో సంబంధిత అధికారులతో నిర్వహించిన రోడ్ సేఫ్టీ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సమావేశంలో పోలీస్, ట్రాఫిక్, మున్సిపల్, రోడ్డు రవాణా శాఖల అధికారులతో కలిసి పట్టణంలోని ప్రస్తుత పరిస్థితులను సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన మార్గదర్శకాలు చేశారు.పట్టణంలో నేరాల నియంత్రణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, ప్రజల భద్రత కోసం రానున్న ఆరు నెలల్లో పాలమూరు పట్టణం మొత్తం 750 వరకు సీసీ కెమెరాలతో నిఘా చేయాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సీసీ కెమెరాలను ఎస్డీఎఫ్, ముడా, మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో సమన్వయంతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చిన్నపిల్లలు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో మైనర్లు వాహనాలు నడపకుండా కఠినంగా నియంత్రించాలని పోలీస్ శాఖను ఆదేశించారు. తల్లిదండ్రులపై కూడా బాధ్యతను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరం చుట్టూ ఉన్న ప్రధాన హైవేలు, బైపాస్ రోడ్లలో స్పీడ్ గన్స్ ఏర్పాటు చేసి వేగ నియంత్రణపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో అతివేగం వల్ల జరిగే ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. వివిధ శాఖల మధ్య సమన్వయం పెంచడానికి రోడ్ సేఫ్టీ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీలో ఎస్పి, నగర మేయర్, డిప్యూటీ మేయర్, ముడా చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తదితరులు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కమిటీ ప్రతి నెలా సమావేశమై రోడ్ సేఫ్టీ పరిస్థితులను సమీక్షించి, తక్షణ చర్యలు చేపడుతుందని తెలిపారు. వాహన యజమానులు, డ్రైవర్లలో బాధ్యత పెంపొందించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియమాల పాటించాలని, తప్పకుండా హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పట్టణంలో సమయాన్ని మించి బార్ షాపులు, హోటల్స్ నడపరాదని హెచ్చరించారు. నియమావళి ఉల్లంఘన జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు కోసం ఎస్పి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. అలాగే ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తున్న వారు రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా అవగాహన కల్పిస్తూ నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో, బాధ్యతతో పనిచేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజలకు సేవలందించడం తమ ప్రాధాన్యతగా తీసుకోవాలని తెలిపారు. పాలమూరును భద్రమైన, సురక్షితమైన పట్టణంగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యత అని,రోడ్డు ప్రమాదాలు తగ్గించడం, ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.ఈ సమావేశం లో జిల్లా ఎస్పీ జానకి, నగర మేయర్ గుమ్మాల మమత , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిప్యూటీ మేయర్ మారే పల్లి సురేందర్ రెడ్డి, పోలీస్, మున్సిపల్, ట్రాఫిక్, రోడ్ రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
……………………………………
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.