ముద్ర మల్కాజిగిరి
ప్రజలకు సౌకర్యవంతంగా అందుబాటులో ఉండే ప్రాంతాల్లో కొత్త రేషన్ షాపులను ఏర్పాటు చేయాలని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ సంధ్య ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల సుధీర్ బాబు ఇచ్చిన సూచనల మేరకు రేషన్ షాపుల ఏర్పాటు అంశంపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేషన్ కార్డు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన పేదలకు త్వరితగతిన రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా పౌర సరఫరాల సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు జేఏసీ వెంకన్న, తోట నరేందర్ రెడ్డి, మేకల రాము యాదవ్, అనిల్ కిషోర్ గౌడ్, రేషన్ డీలర్ సభ్యులు బాల్‌రెడ్డి, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.