సముచిత న్యాయం జరగాలంటే 42 శాతం రిజర్వేషన్లు అవసరం
బీసీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా కృషి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో ఉన్న 90కి పైగా ఉన్న బీసీ కులాలు తమ హక్కుల సాధనకు ఐక్యతతో ముందుకు సాగాలని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు సముచిత న్యాయం జరగాలంటే 42 శాతం రిజర్వేషన్లు అవసరమని స్పష్టం చేశారు. బీసీ సమాజంలో మార్పు ప్రారంభమైందన్న ఆయన తమ లక్ష్య సాధన కోసం బీసీ సమాజం మొత్తం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. బీసీలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. నియోజకవర్గాల వారీగా బీసీ కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి ప్రత్యేక విధానం రూపకల్పనలో నిమగ్నమైనట్లు వివరించారు. ఆదివారం శంషాబాద్ లోని సిద్ధాంతిలో నిర్మించిన ముదిరాజ్ కమ్యూనిటీ భవనాన్నిఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముదిరాజ్ ల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ సర్కారు కట్టుబడి ఉందన్నారు. వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు కమ్యూనిటీ భవనాలు దోహదపడాలని మంత్రి ఆకాంక్షించారు. రాబోయే బడ్జెట్‌లో బీసీ కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి అధిక నిధులు కేటాయించేలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానని మంత్రి తెలిపారు. కోకాపేటలో నిర్మించనున్న ముదిరాజ్ భవనానికి కూడా తగిన నిధులు కేటాయించాలని కోరనున్నట్లు చెప్పారు. శంషాబాద్‌లో ముదిరాజ్ కమ్యూనిటీ భవనం నిర్మాణానికి కృషి చేసిన వారందరికీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు. శంషాబాద్ మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మెరుగు సురేష్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్ మేకల వెంకటేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బి ఆర్ ఎస్ ఇన్చార్జి కార్తీక్ రెడ్డి, శంషాబాద్ మాజీ ఎంపీపీ చెక్కల ఎల్లయ్య ముదిరాజ్, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా మాజీ వైస్ చైర్మన్ ఈట గణేష్ ముదిరాజ్, మాజీ జెడ్పిటిసి తన్విరాజు ముదిరాజ్, శంషాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ సుష్మా మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.