- శంషాబాద్ విమానాశ్రయం నుంచి గాంధీభవన్ కు భారీ ర్యాలీ.
- గాంధీభవన్ వద్ద టపాసుల పేల్చడంపై అభ్యంతరం
- మల్లు అనుచరుల హంగామాపై మండిపాటు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ నేతల అత్యుత్సాహాం, దూకుడుకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ మీనాక్షి నటరాజన్ కళ్లెం వేసే ప్రయత్నం ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే పలు అంశాల్లో టీపీసీసీ నేతలను మందలించిన ఆమె పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వెళ్తున్న వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు.తాజాగా కాంగ్రెస్ ఎంపీ మల్లు రవికి హెచ్చరించిన ఆమె తీరు పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా నియమితులైన తర్వాత రెండు రోజుల క్రితం తొలిసారి ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చిన మల్లు రవి నేరుగా గాంధీ భవన్‌కు చేరుకున్నారు. అక్కడ మాజీ చైర్మన్ జి.చిన్నారెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు.అనంతరం అక్కడే ఉన్న మీనాక్షి చౌదరిని మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే ఢిల్లీ నుంచి వచ్చాక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఆయన తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీ తీశారు.గాంధీ భవన్ వద్ద టపాసులు పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఈ వ్యవహారాన్ని మీనాక్షి సీరియస్ గా తీసుకున్నారు.మల్లురవి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పదవి వస్తే ఇంత హంగామా అవసరమా? అని ప్రశ్నించారు. ఎందుకు ఇంత హడావిడి చేశారంటూ మల్లు రవికి చీవాట్లు పెట్టినట్లు గాంధీభవన్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల పార్టీలో చేరిన అచ్చంపేటకు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడికి పదవి ఇవ్వడానికి ఎందుకు లాబీయింగ్ చేశారంటూ మల్లురవిని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఆయన పార్టీ మారితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీసినట్లు తెలుస్తోంది.