గ్రామపంచాయతీ భవనాల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.
ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమం ద్వారా మంజూరైన పలు ప్రభుత్వ భవనాల నిర్మాణ పనుల పురోగతిపై డిఆర్డిఓ, ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమం ద్వారా మంజూరైన గ్రామపంచాయతీ, అంగన్వాడి, పాఠశాల, ఇతర భవనాల నిర్మాణంలో వేగం పెంచాలని అన్నారు. ఇంకా ప్రారంభం కానీ పనులపై ఎంపీడీవోలు, తహసిల్దార్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. స్థలం కొరత ఉన్న గ్రామాల్లో ఎంపీడీవోలు, తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో సందర్శించి అనువైన స్థలాన్ని వెంటనే గుర్తించాలని ఆదేశించారు.

మండల స్థాయిలో సర్పంచ్, కార్యదర్శి, ఏఈ, డిఈ, ఎంపీడీవోలు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భవన నిర్మాణాల వేగవంతానికి, అక్కడ ఎదురయ్యే సమస్యల పరిష్కరించాలని తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. స్లాబ్, రూఫ్ లెవెల్ కు చేరుకున్న భవన నిర్మాణ పనులు వేగవంతం చేసి ప్రజాపాలన కార్యక్రమంలో ప్రారంభించేలా ఏర్పాటు చేయాలన్నారు.
సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డిఆర్డి ఓ శ్రీధర్, పంచాయతీరాజ్ ఈఈ రహమాన్, ఎంపీడీవోలు, డిఈలు, ఏఈలు పాల్గొన్నారు.