Take a fresh look at your lifestyle.

హుజుర్నగర్‌లో రాష్ట్రానికి మోడల్‌గా నిలిచే కాలనీ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజుర్నగర్:
హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్ట సమీపంలో 116 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న 2,160 సింగిల్ బెడ్‌రూమ్ ఇండ్లతో కూడిన మోడల్ కాలనీ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

మంగళవారం సాయంత్రం ఆయన మోడల్ కాలనీ నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ, ఆర్డీవోలు, గృహనిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, మోడల్ కాలనీ లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేశారు. పైరవీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఉండదని, అర్హులకే ఇండ్లు కేటాయిస్తామని తెలిపారు.

తొలి విడతలో 1500 మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. లబ్ధిదారుల జాబితాను నిశితంగా పరిశీలించిన తర్వాతే విడుదల చేస్తామని చెప్పారు. అనర్హులు జాబితాలో ఉంటే వెంటనే ఫిర్యాదు చేయవచ్చని ప్రజలకు సూచించారు.

ప్రజాప్రతినిధుల సిఫార్సులు ఉన్నప్పటికీ అవి అర్హులైన వారికే పరిమితమవుతాయని, అనర్హులను సిఫార్సు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రజల్లో గందరగోళం సృష్టిస్తే కూడా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

మోడల్ కాలనీలో రూ.10 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్, మరో రూ.10 కోట్లతో అంగన్‌వాడీ కేంద్రం, కమ్యూనిటీ హాల్, క్రీడా ప్రాంగణం, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

అంతేకాక సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు కూడా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఏప్రిల్ నెలాఖరుకు మోడల్ కాలనీ ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు మంత్రి సూచనప్రాయంగా వెల్లడించారు.

2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్‌కు అప్పట్లో దేవాదాయ భూమి కొనుగోలు చేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆలస్యం జరిగినా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు.

హుజుర్నగర్‌కు ఐకాన్‌గా నిలిచే ఈ మోడల్ కాలనీని పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.