- నార్సింగి సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాల ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
(ముద్ర ప్రతినిధి , ఉమ్మడి రంగారెడ్డి) : శనివారం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం, నార్సింగ్ లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటిస్తూ వారికి అందుతున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. పిల్లలకు స్వచ్ఛమైన, రుచికరమైన ఆహారం అందించాలని ఆహారం వండే సిబ్బంది పరిశుభ్రంగా ఆహార పదార్థాలను సిద్ధం చేయాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. డైనింగ్ హాల్, క్లాస్ రూమ్లు, పరిసరాలు, స్టోర్ రూమ్ లో నిలువ ఉంచిన ఆహార పదార్థాలు, కూరగాయలు, ఇతర సరుకులను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని ఆరా తీశారు. ప్రతి సబ్జెక్టు పై ఎలాంటి సందేహాలు ఉన్న సమాధానాలు చెబుతూ విద్య బోధనలు అందించాలని సూచించారు. పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున సిలబస్ పూర్తి చేసి పునఃశ్చరణ తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆయా సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అన్నారు. పదవ తరగతిలో నూటికి నూరు శాతం విద్యార్థులందరూ అత్యుత్తమ గ్రేడ్లతో ఉత్తీర్ణత సాధించేలా నాణ్యమైన బోధన అందించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ వెంట నార్సింగి మున్సిపల్ కమిషనర్, తదితరులు ఉన్నారు.
