ముద్ర,పానుగల్: పానుగల్ మండలం తెల్ల రాళ్లపల్లి తాండ కు చెందిన ఇస్లావత్ చిట్టమ్మ,భాస్కర్ దంపతుల కుమారుడు ఇస్లావత్ వెంకటేష్ లా సబ్జెక్టులో ప్రతిష్ఠాత్మక జాతీయస్థాయి ఫెలోషిప్‌కు ఎంపికై విశేష కీర్తిని సాధించారు.ఇతను ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ కళాశాలలో ఐదు సంవత్సరాల ఎల్.ఎల్.బి,అలాగే రెండు సంవత్సరాల ఎల్ ఎల్ ఎం పూర్తి చేసుకుని అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసుకుంటూనే దేశవ్యాప్తంగా అనేక మంది అభ్యర్థులు పోటీ పడిన ఈ ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్‌ను గెలుచుకోవడం ద్వారా వెంకటేష్ విద్యా విశేష ప్రతిభను నిరూపించుకున్నారు.ఈ ఎంపిక ద్వారా అతనికి పీహెచ్డీ అడ్మిషన్ అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఐదు సంవత్సరాల పాటు ఫెలోషిప్ అందుతుంది. నెలవారీ ఆర్థిక సహాయం, పరిశోధనకు అవసరమైన సౌకర్యాలు మరియు ఇతర ప్రయోజనాలు లభిస్తాయి.లా రంగంలో అగ్రగామిగా ఎదగడానికి ఇది గొప్ప అవకాశం అని భావిస్తున్నారు.ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ రాంప్రసాద్ మాట్లాడుతూ, వెంకటేష్ కృషి, పట్టుదల వల్లే ఈ ఘనత సాధ్యమైంది. ఇది మా సంస్థకు గర్వకారణం” అని అన్నారు.వెంకటేష్ తన విజయంపై మాట్లాడుతూ, “నా మార్గదర్శకులు, కుటుంబసభ్యులు, మిత్రుల ప్రోత్సాహమే ఈ విజయంలో కీలకపాత్ర వహించాయి. భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే విధంగా న్యాయ పరిశోధనలో ముందుకు సాగాలని నా లక్ష్యం” అని తెలిపారు.ఈ ఘనతను సాధించిన అతనికి కుటుంబసభ్యులు, స్నేహితులు, అధ్యాపకులు శుభాకాంక్షలు తెలియజేశారు.