- తీవ్రంగా శ్రమిస్తున్న కాంగ్రెస్, బిజెపి పార్టీలు
- ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
- బండికి అగ్నిపరీక్ష పెట్టిన అంజిరెడ్డి
- వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు
- వినూత్న తీర్పు కోరుకుంటున్న పట్టభద్రుల

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు స్వతంత్ర అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గౌడ్ తోనే ప్రధాన పోటీ నెలకొన్నట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ జోరుగా నడుస్తుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులకు పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన రెండో ప్రాధాన్యత ఓటు వచ్చేసరికి ప్రసన్న హరికృష్ణను మెజారిటీ ఓటర్లు ఎంచుకోవడం ఇక్కడ ఫలితాన్ని శాసించే స్థితి నెలకొనడం గమనించదగ్గ విషయం. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ కు ఓటు వేసిన పట్టభద్రుడు రెండో ప్రాధాన్యత ఓటు బిజెపికి వేసే ప్రసక్తే ఉండదు. అలాగే బిజెపికి ఓటు వేసిన పట్టభద్రుడు కాంగ్రెస్ కు ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయడు. దీంతో ప్రధాన పార్టీలకు సమంగా ప్రచారంలో దూసుకుపోతున్న హరికృష్ణకు రెండో ప్రాధాన్యత ఓట్లు అధిక మొత్తంలో పడే అవకాశం మెండుగా కనిపిస్తున్నాయి. ఈ అంశమే ఫలితాన్ని ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హోరాహోరీగా తలపడుతున్న పోరులో మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం వచ్చే అవకాశాలు స్వల్పమే అని మేధావులు భావిస్తున్నారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓటుతోనే తుది ఫలితం వెలువడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. దీంతో ప్రధాన ప్రత్యర్థులుగా పోటీ పడుతున్న అభ్యర్థుల్లో ఎవరికి రెండో ప్రాధాన్యత ఓట్లు అధికంగా పొందుతారు వారే విజేతలుగా నిలుస్తారు. ఆరు నెలలుగా 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా 19 సంవత్సరాల సర్విస్ కు రాజీనామా చేసి పట్టభద్రుల శ్రేయస్సు పరమావధిగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రసన్న హరికృష్ణ కంటెంట్ తో కూడిన స్పీచ్ లతో పట్టభద్రులను తన వైపు తిప్పుకోగలిగారు. ఆయన డెడికేషన్ పట్ల పట్టభద్రులు ఆలోచనలో పడ్డారు. కాంగ్రెస్, బిజెపి పార్టీల అభ్యర్థులతో సమంగా ప్రచారంలో ఎక్కడ తగ్గకుండా విలక్షణ పంత ఎంచుకొని హోరాహోరీగా తలపడుతున్నారు. అతనికి బీసీ కార్డు కూడా కలిసి వచ్చే అంశంగా మారింది.

రంగంలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు కోసం ముఖ్యమంత్రి సైతం రంగంలోకి దిగారు. నేడు స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాలలో పట్టభద్రుల బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పట్టభద్రులను తమ వైపు తిప్పుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. విద్యా వ్యవస్థలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలను తన ప్రసంగంలో ప్రముఖంగా వివరించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు దిశా నిర్దేశం చేయనున్నారు. 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం రెఫరండం అయ్యే అవకాశం ఉంది. కావున ప్రతి ఒక్క కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇప్పటికే జిల్లా మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లకు గెలుపు బాధ్యతలను అప్పజెప్పారు. వారు పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పార్టీ క్యాడర్ తో మమేకమై వ్యూహాత్మక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు.
పట్టభద్రులను ఆకట్టుకోలేకపోతున్న అంజిరెడ్డి
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు అగ్ని పరీక్ష గా మారిందని రాజకీయంగా చర్చ నడుస్తుంది. బండి స్పీడ్ ను అంజిరెడ్డి అందుకోలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని తానై విజయమే లక్ష్యంగా బండి సంజయ్ తన పార్లమెంటు ఎన్నికల కంటే అధికంగా కష్టపడుతూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఎమ్మెల్సీ స్థానాలను గెలిచి కాంగ్రెస్ కు బిజెపి మాత్రమే ప్రత్యామ్నాయ అనేలా రాష్ట్ర ప్రజలకు సంకేతం ఇచ్చేలా వ్యూహం రచించారు. క్యాడర్ కు దిశా నిర్దేశం చేస్తూ ఎన్నికల ప్రక్రియకు సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే బిజెపి అగ్ర నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు విస్తృతంగా ప్రచార నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని నలుగురు ఎంపీలు, ఎమ్మెల్యేలు అంజిరెడ్డి గెలుపు కోసం శ్రమిస్తున్న వారిని సమన్వయపరచుకోవడంలో అంజిరెడ్డి విఫలమవుతున్నాడన్న చర్చ నడుస్తుంది. అతని ప్రసంగాలు పట్టభద్రులను ఆకట్టుకోవడం లేదంటూ ఆరోపణలు వినబడుతున్నాయి. ఎన్నికల్లో సైతం వ్యాపారవేత్త ధోరణినే ప్రదర్శిస్తున్నాడంటూ పార్టీలోనే గుసగుసలు వినబడుతున్నాయి. పట్టభద్రులకు కు అందుబాటులో ఉండకపోవడం కూడా మైనస్ గా తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే బిజెపి రాష్ట్ర పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవడంమే లక్ష్యంగా బిజెపి శ్రేణులను సమాయత్తం చేసింది. అందుకోసం వ్యూహాత్మక ప్రణాళికలకు రూపకల్పన చేసింది. సమావేశాలు నిర్వహిస్తూ పోల్ మేనేజ్మెంట్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై పార్టీ కార్యకర్తలకు పలు కీలక సూచనలు చేసింది. సిద్ధాంతం కలిగిన పార్టీలో అంకుటిత దీక్షతో పనిచేసే కార్యకర్తలు, విద్యావంతులైన యువత ఉండడం బిజెపికి ప్లస్ పాయింట్ అని బిజెపి పార్టీలోనే అధికంగా పట్టబద్రుల ఓట్లు ఉన్నాయని క్యాడర్ కు దిశా నిర్దేశం చేసింది. ప్రతి 50 మంది పట్టభద్రులకు ఒక ఇన్చార్జిను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చింది.
చాప కింద నీరుల ఆ ఇద్దరు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్, స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్ రావులు చాప కింద నీరులా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఓట్లను కొల్లగొట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఆరు నెలలుగా నాలుగు ఉమ్మడి జిల్లాల్లో విస్తృతంగా ప్రచార నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ ఆశించిన రవీందర్ సింగ్ కు అధిష్టానం నిర్ణయం విస్మయానికి గురిచేసింది. దీంతో ఎలాగైనా బరిలో నిలవాలని నిశ్చయించుకొని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి బరిలో నిలిచారు. బిఆర్ఎస్ క్యాడర్ ను తన వైపు తిప్పుకోవడం కోసం ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళుతున్నారు. బిఆర్ఎస్ అధిష్టానాన్ని ఒప్పించి తనకు మద్దతు ఇచ్చేలా తుది వరకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారికంగా మద్దతు ఇవ్వకున్నా అంతర్గతంగానైనా క్యాడర్ కు ఆదేశాలు ఇవ్వాలని బిఆర్ఎస్ దళపతిని వేడుకుంటున్నారు. స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్ రావుకు ట్రస్మా స్ట్రాంగ్ ప్లాట్ ఫామ్ గా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థల యజమానులు అతనికి మద్దతు తెలుపుతున్నారు. దీంతో గెలుపు ధీమాతో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇటీవల ప్రచారం చేసి తిరుగు ప్రయాణంలో కోరుట్ల వద్ద ఆక్సిడెంట్ కు గురయ్యారు యాదగిరి శేఖర్ రావు. గాయాలతో బయటపడ్డ ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కీలక సమయంలో ఆక్సిడెంట్ గురవడం ఆయనకు ఒకింత ఆందోళన కలిగిస్తున్న అంశం. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ఆస్పత్రిలోనే మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ ఇద్దరు అభ్యర్థులు చాప కింద నీరులా ప్రచారం నిర్వహిస్తున్న వీరు గెలుస్తారా లేక వీరు చీల్చే ఓట్లు ఎవరి పుట్టి ముంచనున్నాయో, ఎవరి తలరాతలను మార్చనున్నాయో వేచి చూడాలి.