ముద్ర, సూర్యాపేట (06.04.2026):
సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ ప్రజల సమస్యలను నేరుగా విని తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన పిర్యాదుదారులు తమ సమస్యలను ఎస్పీకి వివరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ పిర్యాదులను స్వీకరించి సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ ద్వారా తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఫిర్యాదుపై చట్టపరంగా వేగవంతమైన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల సమస్యలను ఆలస్యం లేకుండా పరిష్కరించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు మరింత భరోసా కల్పించేందుకు పోలీసులు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని సూచించారు.
పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి జోక్యం లేకుండా ప్రజలు నేరుగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ నరసింహ పిలుపునిచ్చారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రతి సమస్యకు న్యాయం లభిస్తుందని ఆయన తెలిపారు.
శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు చేరువ కావడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.